భౌతికశాస్త్ర కాంతిపుంజం
సందర్భం - నేడు జాతీయ సైన్‌స దినోత్సవం
దేశానికి తొలి ‘భారతరత్న’ అయిన సర్ సి.వి.రామన్ అంతకన్నా కూడా ఎక్కువగా మానవరత్న! నోబెల్ సహా ఇంకా ఎన్నో వైజ్ఞానికరంగ హోదాలకు గౌరవం తెచ్చిపెట్టిన ఈ భౌతిక శాస్త్రవేత్త సవినయ సంపన్నుడు. పదహారేళ్లకు డిగ్రీ, తర్వాత రెండేళ్లకు మాస్టర్స్ డిగ్రీ సాధించిన నిరుపేద విద్యార్థి. ఆయనలోని అణకువ, విధేయత ఆయన వైజ్ఞానిక నిరాడంబరతను దాచేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ ఉత్సాహం, ఆ ఉత్తేజం, ఆ కుతూహలం యువశాస్త్రవేత్తల కలలను కాంతిమంతం చేస్తుండేవి. రామన్‌ను మద్రాస్ తీర్చిదిద్దింది, కలకత్తా చేరదీసింది. బెంగుళూరు తనను చేరదీయించుకుంది.
ఈ మూడు నగరాలూ రామన్ ప్రభావం నుంచి ఏనాటికీ బయటపడలేవు. ఆ మాటకొస్తే దేశం మొత్తం ఆరు దశాబ్దాలపాటు ఆయన సూత్రాలను అనుసరించి, ఆయన సేవలతో శాస్త్ర సాఫల్యం పొందింది. ‘రామన్ ఎఫెక్ట్’ ఆయన ఆవిష్కరణే. ఏటా మనం ఫిబ్రవరి 28న ‘సైన్స్ డే’ జరుపుకోవడం వెనుక రామన్ ఎఫెక్ట్ ఉంది. సరిగ్గా ఈ రోజునే ఆయన కాంతి ప్రభావ సూత్రాన్ని కనుగొన్నారు. సముద్రపు నీటిపై సూర్యకాంతి పడిన ప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా చెల్లాచెదురై, మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని రామన్ సిద్ధాంతీకరించారు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా చెల్లా చెదరవుతాయో తెలిపే పరిశోధన ఫలితమే రామన్ ఎఫెక్ట్ (రామన్ ప్రభావం).
మద్రాసులో మాస్టర్స్ డిగ్రీ అయ్యాక తల్లిదండ్రులు, సే్నిహ తులు ఒత్తిడి చేయడంతో రాసిన ఒక పోటీ పరీక్ష... రామన్‌కు కలకత్తాలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఉద్యోగాన్ని సంపాదించి పెట్టింది. వెళ్లాలా వద్దా? అయిన వారి అందరి ప్రాణాలూ రామన్ ఉద్యోగం మీదే ఉన్నాయి. రామన్ ప్రాణాలు మాత్రం భౌతికశాస్త్రంలో ఉన్నాయి. రెండు ప్రాణాలను కాపాడుకోవాలి. అందుకే ఆయన రెండు పడవల మీద కాళ్లు వేశారు. ఉద్యోగం చేస్తూనే, అక్కడి ‘ఇండియన్ అసోషియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్’లో సభ్యుడిగా చేరారు. అక్కడే ఆయనకు కలకత్తా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ ఆశుతోష్ ముఖర్జీతో పరిచయం అయింది.
భౌతికశాస్త్ర పరిశోధనాంశాలలో రామన్ ప్రతిభకు ముగ్ధులైన ముఖర్జీ ఆయన్ని కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా నియమించారు. అదే సమయంలో కల్టివేషన్ ఆఫ్ సైన్స్ కార్యద ర్శిగా పదోన్నతిపై అమెరికాలో, ఐరోపా దేశాలలో రామన్ విస్తృతంగా పర్యటించారు. కలకత్తాలో పదిహేనేళ్లు ఉన్నాక బెంగు ళూరులోని భారత విజ్ఞాన శాస్త్ర సంస్థకు డెరైక్టర్ అయ్యారు. పదవీ విరమణ అనంతరం ‘రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ నెలకొల్పి ఎందరో యువ మేధావుల పరిశోధనలకు ఆయన చేయూతను ఇచ్చారు.
రామన్‌కు ఐన్‌స్టీన్, న్యూటన్, రేలీగ్, బోల్జ్‌మేన్ అభిమాన శాస్త్రవేత్తలు. కాంతి, ధ్వని, స్ఫటికం, వర్ణదర్శనం ఇష్టమైన అంశాలు. ‘‘ఒక దేశం యొక్క నిజమైన సంపద ఆ దేశ ప్రజల మేధాపరమైన, భౌతికమైన బలంలో ఉంది’’ అని విశ్వసించే రామన్, తన జీవితం మొత్తాన్నీ సైన్సు ప్రయోగాలు చేయడానికీ, చేయించడానికీ అంకితం చేశారు. 1888 నవంబర్ 7న మద్రాసు లో జన్మించిన చంద్రశేఖర వెంకటరామన్ 1970 నవ ంబర్ 21న బెంగుళూరులో మరణించారు.