
పాట్నా : ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు, ఐశ్వర్య రాయ్‌కి నిశ్చితార్థం అయింది. పాట్నాలోని మౌర్య హోటల్‌లో వీరిద్దరి నిశ్చితార్థం బుధవారం జరిగింది. దాణా కుంభకోణ కేసుల్లో ప్రస్తుతం జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, తన కొడుకు నిశ్చితార్థానికి రాలేకపోయారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లాలూ సోదరీమణులు ఈ నిశ్చితార్థం కోసం ప్రత్యేకంగా సిటీకి విచ్చేశారు.
తేజ్ ప్రతాప్, ఐశ్వర్య రాయ్ రింగులు మార్చుకునే ఈ ఘట్టానికి సుమారు 200 మంది అతిథులు హాజరైనట్టు తెలిసింది. ఈ నిశ్చితార్థం కోసం మౌర్య హోటల్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. ఢిల్లీ, కోల్‌కత్తా, బెంగళూరు, పుణే నుంచి తీసుకొచ్చిన పువ్వులతో ఈ హోటల్‌ను అట్టహాసంగా తీర్చిదిద్దారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కూతురు ప్రియాంక గాంధీని కూడా ఈ ఈవెంట్‌కు ఆహ్వానించినట్టు తెలిసింది. కానీ ఆమె ఈ ఈవెంట్‌కు హాజరయ్యారో లేదో తెలియరాలేదు. పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో భాగమైనట్టు తెలిసింది. వీరిద్దరి వివాహం వచ్చే నెల 12వ తేదీన పాట్నాలోని వెటిరినరీ కాలేజీ కాంపౌండ్‌లో జరుగనుంది.
తేజ్‌ను మనువాడబోతోన్న ఐశ్వర్య బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు. ఆమె తండ్రి చంద్రికా రాయ్, బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. పాట్నాలోనే హైస్కూల్ వరకు చదువుకున్న ఐశ్వర్య.. తర్వాత ఉన్నత చదువులు మొత్తం ఢిల్లీలో పూర్తి చేసింది. అయితే తేజ్ ప్రతాప్ 12వ తరగతి చదివారు.



Comments
Please login to add a commentAdd a comment