
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో కీలక రాష్ట్రమైన యూపీలో విపక్షాల పొత్తులు ఉత్కంఠ రేపుతున్నాయి. విపక్ష కూటమికి పెద్దన్నగా వ్యవహరించే కాంగ్రెస్ లేకుండానే ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీలు మహాకూటమిగా ఏర్పడి సీట్ల పంపకం కసరత్తును కొలిక్కితెచ్చాయని చెబుతున్నారు.
సీట్ల సర్ధుబాటుపై కసరత్తును పూర్తిచేసిన ఎస్పీ, బీఎస్పీలు ఇక దీనిపై ప్రకటన చేయడం లాంఛనప్రాయమేనని భావిస్తున్నారు. తక్కువ స్ధానాలతో సరిపెట్టుకుంటామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొనడంతో సీట్ల సర్దుబాటు సులభంగా పూర్తయిందని ఇరు పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఎస్పీ కంటే ఒకటి రెండు స్ధానాల్లో అధికంగా బీఎస్పీ బరిలో ఉండేలా సీట్ల పంపకం జరిగిందని చెబుతున్నారు.
కాగా, 39 స్ధానాల్లో బీఎస్పీ, 37 స్ధానాల్లో ఎస్పీ, రెండు స్ధానాల్లో ఆర్‌ఎల్డీ పోటీ చేసేలా సీట్ల సర్దుబాటు ఖరారైనట్టు సమాచారం. కాంగ్రెస్ కూటమిలో ఉన్నా, లేకున్నా అమేథి, రాయ్‌బరేలి స్ధానాలను కాంగ్రెస్‌కు వదిలివేసి మిగిలిన సీట్లలో సర్ధుబాటు పూర్తయిందని తెలిసింది. కూటమి ఏర్పాటు పూర్తయిందని, సీట్ల సర్ధుబాటును వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య ప్రకటిస్తామని ఎస్పీ ప్రతినిధి సునీల్ సజన్ వెల్లడించారు.
కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తేనే మహాకూటమికి అనుకూలమని ఎస్పీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. మరోవైపు యూపీలో ఈ తరహా పొత్తులపై కాంగ్రెస్ అసంతృప్తితో ఉంది. మహాకూటమిలో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment