
లక్నో : ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నియంత్రిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నిర్ణయాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. ఈ ఆర్డినెన్స్‌లో రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీలు మూతపడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించమని స్పష్టం చేస్తూ హామీ ఇవ్వాలని, దేశ లౌకిక, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వర్సిటీలు కట్టుబడి ఉండాలని యూపీ క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ ముసాయిదాలో పొందుపరిచారు.
కాగా ఈ ఆర్డినెన్స్ ద్వారా ప్రైవేట్ వర్సిటీలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే వారిపై నియంత్రణలు విధించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యోగి ఆదిత్యానాథ్ ఓవైపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతూనే మరోవైపు పెట్టుబడిదారులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. నూతన విశ్వవిద్యాలయాలు నెలకొల్పడం పట్ల యూపీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని, రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మూతపడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని అఖిలేష్ అన్నారు. మరోవైపు యూపీ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని కాంగ్రెస్ పార్టీ సైతం తాజా ఆర్డినెన్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment