'అఖిలేశన్నే నడిపిస్తాడు.. ఆయనకే ఇవ్వాలి'
లక్నో: సమస్య మొత్తం సర్దుమణిగిందని, పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు రాబోయే ఎన్నికల్లో పార్టీకి సంపూర్ణ విజయానికి కృషిచేయాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆదేశించగా శనివారం మళ్లీ సమస్య మొదటికొచ్చింది. రాష్ట్ర పార్టీ పగ్గాలు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు లక్నోలోని పార్టీ కార్యాలయం ముందుకు వచ్చి నినాదాలు చేశారు. నెత్తిన ఎర్ర టోపీలు ధరించి చేతిలో అఖిలేశ్, ఆయన భార్య డింపుల్ ఉన్న పోస్టర్లను పట్టుకొని నినాదాలు చేస్తూ బారులు తీరారు.
'అఖిలేశ్ ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేయాలి, అఖిలేశన్న పార్టీని నడిపించగల సమర్థుడు' అంటూ గట్టిగా అరుస్తూ పార్టీ కార్యాలయం వద్ద సందడి చేశారు. సమాజ్వాది పార్టీకి చెందిన నాలుగు ఇతర సంస్థలు ఈ డిమాండ్ తో పార్టీ అధినేత ములాయం సింగ్ కు లేఖ కూడా రాశారు. అందులో తాము అఖిలేశ్ నాయకత్వాన్ని తప్ప ఏ ఒక్కరి నాయకత్వాన్ని అంగీకరించబోమని కుండబద్ధలు కొట్టారు.
అఖిలేశ్ ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం యువత జీర్ణించుకోలేకపోతుందని, అవసరం అయితే, ఆయన కోసం తమను తాము దహించుకొని ప్రాణత్యాగం చేసేందుకు యువత సిద్ధంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాఉండగా, ఉత్తరప్రదేశ్ సమాజ్ వాది పార్టీ పగ్గాలు శివ్ పాల్ యాదవ్ చేతుల్లోనే ఉంటాయని స్పష్టం చేస్తూ ఆ పార్టీ తరుపున ప్రకటన వెలువడింది.