అఖిలేశ్‌ ఇలా కోపం తీర్చుకున్నారా...!? | Akhilesh Yadav Accused Of Taking Away ACs And Italian Marble From Official Bungalow While Vacating | Sakshi
Sakshi News home page

అఖిలేశ్‌ ఇలా కోపం తీర్చుకున్నారా...!?

Published Sat, Jun 9 2018 4:42 PM | Last Updated on Sat, Jun 9 2018 8:09 PM

Akhilesh Yadav Accused Of Taking Away ACs And Italian Marble From Official Bungalow While Vacating - Sakshi

లక్నో : సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఈనెల(జూన్‌) 2న తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే అఖిలేశ్‌ ఖాళీ చేసిన 4- విక్రమాదిత్య మార్గ్‌లోని బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి  శనివారం ఉదయం మీడియాతో సహా అక్కడికి చేరుకున్న ప్రభుత్వ అధికారులు షాక్‌కు గురయ్యారు.

‘ఇదొక దుర్దినం, జీవితం చాలా చిన్నది.. బాధ పడాల్సిన అవసరం లేదంటూ’  గోడలపై రాసి ఉండటంతో పాటు విదేశాల నుంచి తెప్పించిన మార్బుల్స్‌, టైల్స్‌, ఏసీలు మాయమవడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయమై స్పందించిన ప్రభుత్వాధికారి ఒకరు మాట్లాడుతూ.. 2016లో 45 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అఖిలేశ్‌ కుటుంబ సభ్యుల అభిరుచికి తగినట్లుగా బంగ్లాను పునరుద్ధరించామన్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లోని టర్కిష్‌ టైల్స్‌తో పాటు, ఇటాలియన్‌ మార్బుల్‌, ఏసీలు, గార్డెన్‌ లైట్స్‌ మాయమయ్యాయని తెలిపారు. మార్బుల్స్‌ తీసుకోవడానికి స్విమ్మింగ్‌పూల్‌ సహా పలు చోట్ల తవ్వకాలు జరిపడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అంతేకాకుండా అఖిలేశ్‌ యాదవ్‌ తన కోసం ఏర్పాటు చేసుకున్న జిమ్‌ కూడా మొత్తం ఖాళీగా ఉందని ఆయన వాపోయారు.

చర్యలు తీసుకుంటాం..
బంగ్లా నుంచి మాయమైన వస్తువుల జాబితా తయారు చేస్తున్నామని, అదే విధంగా పలు చోట్ల తవ్వకాలు జరపడం పట్ల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాధికారులు తెలిపారు. మాజీ సీఎం అయి ఉండి ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అనాగరిక చర్య అని వారు పేర్కొన్నారు.

మిలియనీర్‌ అయి ఉండి ఇలా చేస్తారా..
అఖిలేశ్‌ యాదవ్‌ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ చూస్తే ఆయన ఎంత సంపన్నుడో తెలుస్తుందని యూపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు. లక్నోలో ఎన్నో ఆస్తులను కలిగి ఉన్న ఆయనకు అమెరికా, లండన్‌లలో కూడా అనేక బంగ్లాలు ఉండగా ఈవిధంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. తన కోసం కొత్తగా నిర్మించుకుంటున్న విల్లా కోసమే ఆయన ఇలా అనాగరిక చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.

కాగా బంగ్లా ఖాళీ చేయడం ఇష్టంలేనందు వల్లే అఖిలేశ్‌ ఈవిధంగా కోపాన్ని తీర్చుకున్నారని విమర్శలు వెల్లువెత్తడంతో సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి స్పందించారు. తమ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌పై ప్రభుత్వ అధికారులు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. కేవలం ఆయన ఇష్టపడి కొనుక్కున్న, బహుమతులుగా లభించిన వాటినే తన వెంట తీసుకెళ్లారని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement