కార్లకు కోట్లు.. మహిళల బడ్జెట్కు కోతలు
ఉత్తరప్రదేశ్లో మహిళల భద్రత రోజురోజుకూ దిగజారిపోతోంది. దీని గురించి అఖిలేష్ యాదవ్ సర్కారు ఏమాత్రం పట్టించుకోకపోగా.. రాష్ట్ర మహిళా కమిషన్ బడ్జెట్ను గణనీయంగా తగ్గించి పారేసింది. మరోవైపు.. ఏడు సీట్ల మెర్సిడెస్ కార్లు, రెండు లాండ్ క్రూయిజర్లను మాత్రం ఎంచక్కా కొనుగోలు చేసింది. సామాజిక కార్యకర్త ఊర్వశీ శర్మ సమాచారహక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిసింది. గడిచిన మూడేళ్లుగా సమాజ్వాదీ ప్రభుత్వం మహిళా కమిషన్ బడ్జెట్ను గణనీయంగా తగ్గించింది. 2011-12, 2013-14 సంవత్సరాల మధ్య ఈ బడ్జెట్ ఏకంగా 85 శాతం తగ్గింది. 2011-12లో కమిషన్కు రూ. 5.1 కోట్లు కేటాయించి, 4.16 కోట్లే ఇచ్చారు. అందులో ఖర్చయినది 3.9 కోట్లు. అదే 2013-14 సంవత్సరంలో కేటాయింపులు కేవలం 75 లక్షలు మాత్రమే!!
పోనీ నిధులకు ఏమైనా తీవ్రంగా కొరత ఉందా అంటే అదీ లేదు. ప్రస్తుతం లండన్లో కుటుంబంతో గడుపుతున్న అఖిలేష్ యాదవ్, తన కో్సం మెర్సిడెస్ కార్లు, లాండ్ క్రూయిజర్లు మాత్రం ఎంచక్కా కొనుక్కుంటున్నారు. మహిళల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదని మహిళా హక్కుల నేతలు పలువురు తీవ్రంగా ఆక్రోశించారు.