అల్ బదర్ ఉగ్రవాది ముజఫర్ హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులకు భారత భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అల్ బదర్ ఉగ్రవాది హతమయ్యాడు. ఆ సంస్థలోని కీలక కమాండర్ ముజఫర్ అహ్మద్ చనిపోయాడు. ఈ ఎన్‌కౌంటర్ శుక్రవారం తెల్లవారు జామునుంచి కొనసాగుతోంది. జమ్ములోని బుద్గామ్ జిల్లాలోగల మచ్చు ప్రాంతంలో ఉగ్రవాదుల అలికిడి ఉందని సమాచారం తెలుసుకున్న బలగాలు గాలింపులు మొదలు పెట్టాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరపగా బలగాలు ఎదురుకాల్పులతో ప్రతిఘటించింది. ఈ కాల్పుల్లోనే అల్ బదర్ ఉగ్రవాది ముజఫర్ అహ్మద్ హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ఒక జవాను కూడా గాయపడినట్లు సైనికాధికారులు చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థకు మరో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబాకు సంబంధాలున్నాయి.