- కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ బ్యాంక్ ఖాతాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. నల్లధనం, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకే ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. కార్మికుల జీతాల విడుదలకు, అన్ని రంగాల్లోని వారికి బ్యాంక్ ఖాతాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని 4.61 లక్షల మంది కార్మికులకు బ్యాంక్ ఖాతాలు కల్పించినమన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 15 వేల మంది బీడీ కార్మికులకు ఖాతాలు కల్పించినట్టు తెలిపారు. ఎక్కడైతే పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తున్నారో అక్కడ మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశానన్నారు. కాఫీ పొడి వర్కర్స్‌కు బ్యాంకు ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.