
‘జీఎస్టీ’పై అఖిలపక్ష భేటీ!
కాంగ్రెస్ కాదన్నా.. మిగతా విపక్షాలు మద్దతిస్తాయన్న విశ్వాసం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)పై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు త్వరలో అఖిల పక్ష భేటీని నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వేరే స్వకారణాలతో పార్లమెంటును కాంగ్రెస్ అడ్డుకుంటోందని, జీఎస్టీని ముందుకు తెస్తే.. ఒకవేళ కాంగ్రెస్ వ్యతిరేకించినా.. మెజారిటీ విపక్ష పార్టీలు మద్దతిస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అఖిల పక్ష భేటీలో ఆ విషయమే స్పష్టమవుతుందని నమ్ముతోంది. జీఎస్టీపై ప్రతిష్టంభన తొలగాలంటే అఖిలపక్ష భేటీనే సరైన మార్గమని సీనియర్ విపక్ష నేత ఒకరు తేల్చిచెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘అఖిల పక్ష భేటీని ఏ విషయంపైనైనా.. ఎప్పుడైనా జరపొచ్చు.
శుక్రవారం నాటికి ఏ విషయం తేలుతుంది’ అంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం వాఖ్యానించడం గమనార్హం. మరోవైపు, కాంగ్రెస్ మద్దతు సాధించే ప్రయత్నాల్లో భాగంగా.. జీఎస్టీని 18% లోపునకు పరిమితం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అలాగే, 1% అదనపు పన్ను ప్రతిపాదనను కూడా ఉపసంహరించుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ఉత్పత్తి రాష్ట్రాలైన గుజరాత్, తమిళనాడులతో మాట్లాడి, వారి నష్టాన్ని తొలి ఐదేళ్లు భరిస్తామని చెబుతామన్నారు.
మనీ బిల్లుల తరహాలో నిర్ణయ ప్రక్రియ..
పార్లమెంటును అడ్డుకోవడం ద్వారా భవిష్యత్ విపక్ష పార్టీలకు తప్పుడు సందేశం పంపిస్తోందని కాంగ్రెస్‌పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధ్వజమెత్తారు. రాజ్యసభను అడ్డుకునే తీరు ఇలాగే కొనసాగితే.. నిర్ణయాధికార ప్రక్రియ కార్యనిర్వాహక చర్యలకు, మనీ బిల్లులకు మారే పరిస్థితి నెలకొంటుందన్నారు. పన్నులకు, ప్రభుత్వ వ్యయానికి, ఆర్థికాంశాలకు సంబంధించిన మనీ బిల్లులను లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెడ్తారు. లోక్‌సభ ఆమోదం పొందిన మనీ బిల్లులకు రాజ్యసభ సవరణలు చేయలేదు.
ప్రపంచ వాణిజ్యంలో అసమానతలు తొలగాలి
సంకటంలో ‘దోహా ఎజెండా’ అమలు: నిర్మలా సీతారామన్
నైరోబీ: డబ్ల్యూటీవో నిర్వచించిన దోహా అభివృద్ధి ఎజెండా (డీడీఏ) అమలు సంకటంలో ఉందని భారత్ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రపంచ వాణిజ్యంలో శాశ్వతంగా ఇవే అసమానతలు కొనసాగితే డబ్ల్యూటీవో మంత్రులు (సభ్యదేశాల మంత్రులు) అసమర్థులుగా మిగిలిపోవాల్సి వస్తుందని భారత వాణిజ్య శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. కెన్యాలోని నైరోబీలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లోని 160 భాగస్వామ్య దేశాలు పాల్గొన్న 10వ మంత్రివర్గ సమావేశంలో.. సహచరులనుద్దేశించి మంత్రి నిర్మల ప్రసంగించారు. 2001నాటి దోహా సంస్కరణలపై ఇప్పటికీ చర్చలు నడుస్తుండటం వల్లే సమస్య జటిలమవుతోందన్నారు.