సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే
- ఢిల్లీలో నినదించిన 29 రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు
- జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా..
- పెద్ద సంఖ్యలో హాజరైన టీఎన్జీవో, గెజిటెడ్ అధికారుల ఫోరం సభ్యులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో కదంతొక్కారు. అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా చేపట్టారు. ‘పెన్షన్ భిక్షకాదు.. ఉద్యోగుల హక్కు’అని నినదిస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి టీఎన్జీవో, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలన్నీ ఒకే మాటతో నూతన పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు లీలాపత్ డిమాండ్ చేశారు.
పెన్షన్ ఉద్యోగుల హక్కు..: దేవీ ప్రసాద్
టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. పెన్షన్ తీసుకోవడం ఉద్యోగుల హక్కు అని, ఈ ప్రయోజనానికి ప్రతిబంధకంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. సీపీఎస్ వల్ల ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఎలాంటి గ్రాట్యుటీ లభించడం లేదని ఆరోపించారు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. సీపీఎస్ విధానం రద్దుకు తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, దీన్ని అభినందిస్తున్నామన్నారు. ఉద్యమ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను ఏకం చేస్తామని, కేంద్రం పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తెస్తామని తెలిపారు. ధర్నాలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు జైట్లీతో చర్చిస్తా: దత్తాత్రేయ
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో యూపీ ఎన్నికల అనంతరం చర్చిస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా చర్చిస్తానని పేర్కొన్నారు. తనను కలసిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ఆయన చర్చించారు.