
అక్కడ మూత్రం పోసి అడ్డంగా బుక్కయ్యాడు
అలహాబాద్: స్వచ్ఛ్ భారత్ గురించి ఎంత ప్రచారం జరుగుతున్నా.. కొందరు మాత్రం యథేచ్ఛగా తమ 'పని' కానించేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (ఏడీఎమ్) చేసిన పన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతోంది. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అలహాబాద్ బోట్ క్లబ్ లో త్రివేణి మహోత్సవ్ అనే స్వచ్ఛ్ భారత్ ఈవెంట్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇందులో తనతో సహా అందరూ 'క్లీన్ గంగా' అనే టీషర్ట్ ధరించి కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. కానీ ఆయనలా చెప్పిన కొన్ని గంటలకే.. ఏడీఎమ్ ఓపీ శ్రీవాస్తవ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే త్రివేణి సంగమానికి కేవలం కొన్ని అడుగుల దూరంలో నిలుచుని బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు.
ఆయన 'క్లీన్ గంగా' అనే టీ షర్ట్ ధరించి మరీ ఈ పని చేయడంతో.. ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీన్ని క్షమించరాని నేరంగా పరిగణించి ఏడీఎమ్‌ను సస్పెండ్ చేయాలని సీఎం అఖిలేష్ యాదవ్‌ను యూపీ బీజేపీ చీఫ్ లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ కోరారు. 'అసలే నాకు షుగర్.. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను' అని ఈ ఘటనపై ఆయన సీరియస్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమా భారతికి పంపనున్నట్లు బాజ్‌పాయ్ తెలిపారు. ఏడీఎమ్ చర్యపై విచారణ జరిపించడానికి అటల్ రాయ్ అనే అధికారికి బాధ్యతలు అప్పగిస్తూ.. నివేదిక అందిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ వివరించారు.