సరైన సమయంలో ‘పొత్తు’!
ముంబై: వచ్చే 15వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో తమ పొత్తుపై తుదినిర్ణయం సరైన సమయంలో తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందస్తు పొత్తు మంచిదా.. లేక తర్వాత పొత్తు పెట్టుకుంటే మంచిదా అనేది చర్చల్లో తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి ఇప్పటివరకు 5 సార్లు ఎన్నికల్లో పోటీచేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తే ఆరోసారి అవుతుంది. కాగా, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఎటువంటి పొత్తు లాభదాయకమో చర్చల ద్వారా నిర్ణయించుకుంటామని చవాన్ తెలిపారు.
కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రజల మద్దతు పొందిన ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, సీఎం పదవి చేపట్టేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరాటంపై ప్రశ్నించగా.. అతడు అధికారానికి కొత్త అని చవాన్ అన్నారు. గత బీజేపీ, సేన ప్రభుత్వంలో ఉద్ధవ్ పనిచేయలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే, ముంబై, నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార బీజేపీ-శివసేన కూటమి అధ్వాన పాలనను తాము ఈ ఎన్నికల్లో తమ అస్త్రం గా వాడుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే ముస్లింలు, మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన ్ల ప్రజాస్వామ్య కూటమి కల్పించిందనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు.
దేశవ్యాప్తంగా పార్టీకి పునర్వైభవం కల్పించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కృషిచేస్తున్నారని చవాన్ కొనియాడారు. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఒకేవిధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాను సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత విధానపరమైన నిర్ణయా ల్లో పురోగతిపై దృష్టిపెట్టానని చవాన్ చెప్పారు.
ప్రచారానికి సోనియా, రాహుల్
ముంబై: రాష్ట్రంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకానున్నారు. మహారాష్ట్రలో ప్రచారానికి మొత్తం 40 మంది పార్టీల ప్రముఖుల జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవా న్ వెల్లడించారు. ఆజ్‌తక్ చానెల్ ఇంటర్వ్యూ లో ఆయన ఈ విషయం చెప్పారు. అభివృద్ధి విషయంలో గుజరాత్ కంటే తాము అన్ని విధాలా ముందు ఉన్నామని స్పష్టీకరించారు. ఈసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మరింత ముందుకు నడిపిస్తామని పృథ్వీరాజ్ చవాన్ వివరించారు.