
జైపూర్: పెహ్లూఖాన్ మూకదాడి కేసులో ఆరుగురు నిందితులనూ ఆల్వార్ కోర్టు బుధవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఆవులను తరలిస్తున్నారన్న కారణంతో పెహ్లూఖాన్ (55) అతని కుమారులపై రెండేళ్ల క్రితం మూకదాడి చోటు చేసుకోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెహ్లూఖాన్ చనిపోయారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేస్తామని రాజస్తాన్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ అన్నారు. తీర్పుకు సంబంధించిన పత్రాలు ఇంకా రాలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది యోగేంద్ర ఖటనా తెలిపారు.
కోర్టు తీర్పుతో తాము సంతోషంగా లేమని పెహ్లూఖాన్ కుమారుడు ఇర్షాద్ ఖాన్ అన్నారు. పైకోర్టులో అయినా తమకు న్యాయం అందుతుందని భావిస్తున్నట్లు బాధితుల తరఫు న్యాయవాది ఖాసిం ఖాన్ తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత గులాబ్‌చాంద్ కటారియా మాట్లాడుతూ ఘటన జరిగినపుడు బీజేపీ ప్రభుత్వం తీసుకోదగ్గ అన్ని చర్యలు తీసుకుందన్నారు. కోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చిన వారిలో విపిన్ యాదవ్, రవీంధ్ర కుమార్, కలురామ్, దయానంద్, యోగేశ్ కుమార్, భీమ్ రాతిలు ఉన్నారు. ఈ కేసులో మరో ముగ్గురు మైనర్ నిందితులు ఉన్నారు.