Court judgment
-
జైలులో ఖైదీ మృతి...పరిహారంతో ఆ కుటుంబానికి ఊరట
సాక్షి, హైదరాబాద్: జైలులో ఖైదీ మృతి చెందగా, కోర్టు తీర్పుతో ఆ కుటుంబానికి ఊరట లభించింది. బాధిత కుటుంబానికి రూ.6.20 లక్షల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2012, జూలై 4 నుంచి 3 శాతం వడ్డీతో కలిపి ఆర్డర్ ఇచ్చిన మూడు నెలల్లో అందజేయాలని తేల్చిచెప్పింది. కేసు వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో ఐపీసీ 302 కింద నేరం రుజువు కావడంతో మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కుసంగి గ్రామానికి చెందిన కె.వెంకయ్యకు ట్రయల్‌కోర్టు జీవితఖైదు విధించింది. చర్లపల్లి జైలులో ఉంటున్న వెంకయ్యపై 2012, జూలై 4న మరో ఖైదీ డి.నర్సింహులు కత్తెరతో దాడి చేశాడు. గాయపడిన వెంకయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించగా, అదే రోజు మృతి చెందాడు. జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడంటూ భార్య జయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరినా.. అందుకు నిరాకరించిందని పేర్కొన్నారు. దీంతో విధిలేక హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, రూ.10 లక్షలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది పల్లె శ్రీహరినాథ్ వాదనలు వినిపిస్తూ జైలు అధికారుల బాధ్యతారాహిత్యమే వెంకయ్య మృతికి కారణమన్నారు. జైలు అధికారులు నిబంధన మేరకే వ్యవహరించారని, ఇందులో వారి నిర్లక్ష్యం ఏమీ లేదని హోంశాఖ తరఫున జీపీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి మృతిచెందే నాటికి 55 ఏళ్ల వెంకయ్య నెలకు రూ.7,200 సంపాదిస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం.. లెక్కగట్టి రూ.6,33,600 అవుతుందని పేర్కొన్నారు. ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.7.2 లక్షల అవుతుందని లెక్కించారు. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు 2018లో రూ.లక్ష చెల్లించినందున మిగిలిన రూ.6.2 లక్షల అందజేయాలని ఆదేశించారు. -
ఇండియన్ టెక్కీలకు ఊరట.. హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు
అమెరికాలోని ఇండియన్ టెక్కీలకు ఊరట నిస్తూ హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. యూఎస్ టెక్ సెక్టార్‌లోని విదేశీ ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయవచ్చని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కొన్ని వర్గాల హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు ఉపాధి అధికార కార్డులను ఇచ్చే ఒబామా కాలం నాటి నిబంధనలను కొట్టివేయాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!) సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అమెజాన్ , యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు కూడా వ్యతిరేకించాయి. హెచ్-1బీ వర్కర్ల జీవిత భాగస్వాములకు యూఎస్ ఇప్పటివరకు దాదాపు లక్ష వర్క్ ఆథరైజేషన్ కార్డులు జారీ చేసింది, వీరిలో గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేలా కోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు, వలసదారుల హక్కుల కోసం పోరాడే న్యాయవాది అజయ్ భూటోరియా హర్షం వ్యక్తం చేశారు. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ వెళ్లనున్నట్లు సేవ్ జాబ్స్ యూఎస్ఏ తెలిపింది. (గంగూలీ ముద్దుల తనయ.. అప్పుడే ఉద్యోగం చేస్తోంది.. జీతమెంతో తెలుసా?) -
ఆరేళ్ల బాలికపై లైంగికదాడి.. ఆదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. కాగా, కోర్టు తీర్పుపై బాధితులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉట్నూర్ బస్‌స్టేషన్ సమీపంలో ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన షేక్ ఖాలిద్(45) అనే వ్యక్తి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విచారణ సందర్భంగా జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 2వేల జరిమానా విధించింది. కాగా, ఈ జైలు శిక్ష.. జీవిత ఖైదు కన్నా ఎక్కువ కావడం విశేషం. ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై పోలీసులు స్పందించారు. ఈ దారుణ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని పట్టకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం, 60 రోజుల్లోనే ఛార్జ్‌షీట్ వేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. తర్వాత, పోలీసులందరూ టీమ్‌గా వర్క్‌గా పనిచేసి కోర్టుకు సకాలంలో అన్ని ఆధారాలను సమర్పించారు. కేవలం 135 రోజుల్లోనే కోర్టు విచారణ చేసినట్టు తెలిపారు. ఇక, నిందితుడి ఇలాంటి వేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుతోనైనా భవిష్యత్త్‌లో ఇలాంటి దారుణాలు చేసేందుకు నిందితులు భయపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మూకదాడి కేసులో వారంతా నిర్దోషులే
జైపూర్: పెహ్లూఖాన్ మూకదాడి కేసులో ఆరుగురు నిందితులనూ ఆల్వార్ కోర్టు బుధవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఆవులను తరలిస్తున్నారన్న కారణంతో పెహ్లూఖాన్ (55) అతని కుమారులపై రెండేళ్ల క్రితం మూకదాడి చోటు చేసుకోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెహ్లూఖాన్ చనిపోయారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేస్తామని రాజస్తాన్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ అన్నారు. తీర్పుకు సంబంధించిన పత్రాలు ఇంకా రాలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది యోగేంద్ర ఖటనా తెలిపారు. కోర్టు తీర్పుతో తాము సంతోషంగా లేమని పెహ్లూఖాన్ కుమారుడు ఇర్షాద్ ఖాన్ అన్నారు. పైకోర్టులో అయినా తమకు న్యాయం అందుతుందని భావిస్తున్నట్లు బాధితుల తరఫు న్యాయవాది ఖాసిం ఖాన్ తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత గులాబ్‌చాంద్ కటారియా మాట్లాడుతూ ఘటన జరిగినపుడు బీజేపీ ప్రభుత్వం తీసుకోదగ్గ అన్ని చర్యలు తీసుకుందన్నారు. కోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చిన వారిలో విపిన్ యాదవ్, రవీంధ్ర కుమార్, కలురామ్, దయానంద్, యోగేశ్ కుమార్, భీమ్ రాతిలు ఉన్నారు. ఈ కేసులో మరో ముగ్గురు మైనర్ నిందితులు ఉన్నారు. -
కోర్టు చెప్పినా ఇంట్లోకి రానివ్వడం లేదని..
బంజారాహిల్స్: కోర్టు తీర్పు ఇచ్చినా అత్తింటి వారు తనకు ఆశ్రయం కల్పించకపోగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువతి భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్‌కు చెందిన నారాయణరెడ్డి, మంగమ్మ దంపతుల కుమార్తె దీపికకు 2012లో నందినగర్‌కు చెందిన రామిడి శ్రీనివాసరెడ్డితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శ్రీనివాసరెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వారి మధ్య గొడవలు చోటు చేసుకోడంతో అతను భార్యను ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. దీనిపై బాధితురాలు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. దీపికకు నెలకు రూ.6వేల చొప్పున భరణం ఇస్తూ ఇంట్లో ఆశ్రయం కల్పించాల్సిందిగా న్యాయస్థానం శ్రీనివాసరెడ్డిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం దీపిక భర్త ఇంటికి వెళ్లగా కుటుంబసభ్యులు ఆమెను ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో బంధువులు, మహిళా మండలి సభ్యులతో కలిసి ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ విషయమై ఇప్పటికే 13 కేసులు నమోదై ఉన్నాయి. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లోనూ నమోదైన కేసులపై కోర్టులో విచారణ జరుగుతోంది. -
న్యాయ వ్యవస్థపై నమ్మకముంది..
సాక్షి, ఆదిలాబాద్: ‘ఈరోజు సంతోషాన్నిచ్చింది.. అంతిమంగా న్యాయం గెలుస్తుందన్న ఆశ కలుగుతుంది. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడింది. ఆజాద్‌ను ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను. ఆజాద్ ఎన్కౌంటర్ తర్వాత 2013 నుంచి కోర్టుకు విచారణ నిమిత్తం ఆదిలాబాద్‌కు 30 మార్లకు పైగా వచ్చాను. కేసులో ఈ మలుపు కీలకంగా భావిస్తున్నాను..’ అని మావోయిస్టు అగ్రనేత, 2010లో ఆదిలాబాద్ అడవుల్లో ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆజాద్ సహచరిణి పద్మ అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎదురు కాల్పుల్లో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆజాద్ మృతిచెందారని పోలీసులు చెప్పడాన్ని ఆమె మొదటి నుంచి తప్పుబడుతున్నారు. ఆజాద్‌ను పట్టుకొని తీసుకెళ్లి కాల్చి చంపారని చెబుతూ వస్తోంది. తాజాగా గురువారం ఈ కేసును పునర్విచారణ చేపట్టాలని జిల్లా అదనపు సెషన్స్ జడ్జి(ఎస్సీ/ఎస్టీ కోర్టు) భారతిలక్ష్మి కింది కోర్టు(జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు)ను ఆదేశించినట్లు పద్మ తరపున న్యాయవాది సురేష్‌కుమార్ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 29 మంది పోలీసులపై న్యాయ విచారణ ప్రారంభించాలని ఉత్తర్వు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
అగ్నిమాపక శాఖ సెట్‌బ్యాక్ మెలిక
⇔ ఎన్వోసీ జారీలో తీవ్ర జాప్యం ⇔ నిబంధనల ప్రకారం ఉన్నా.. లేదని వాదన ⇔ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న డెవలపర్లు ⇔ కోర్టు తీర్పునూ బేఖాతరంటున్న అధికారులు ⇔ మొత్తంగా ప్రాజెక్ట్‌ల ఆరంభం ఆలస్యం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉద్యోగ అవకాశాలను కల్పించేది నిర్మాణ రంగం. పన్నుల రూపంలో ఖజానాకు కోట్లాది రూపాయలను సమకూర్చి.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేది కూడా ఈ రంగమే! ఇంతటి ప్రాధాన్యమున్న నిర్మాణ రంగం ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వానిది చిన్నచూపేనని నిర్మాణ సంస్థల ఆరోపణ. ఎవరి వాదనేంటో ఓ సారి చూద్దాం. ⇔ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) జారీలో అధికారులు డెవలపర్లను తీవ్రంగా వేధిస్తున్నారని.. వాస్తవానికి నిర్మాణ అనుమతులకు పలు విభాగాల ఎన్వోసీలు అవసరం లేదని.. ఒకే ఒక్క ఎన్వోసీ చాలని ఓ స్థిరాస్తి సంఘం ప్రాపర్టీ షోలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్వోసీ మాత్రమే కాదు నిర్మాణ రంగాన్ని వేధిస్తున్న పలు నిబంధనల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పలుమార్లు ప్రస్తావించారు కూడా. కానీ, సంబంధిత ప్రభుత్వ అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని నిర్మాణ సంస్థల వాదన. ⇔ బహుళ అంతస్తుల భవనాలకు, వాణిజ్య సముదాయాలకు అగ్నిమాపక శాఖ ఎన్వోసీ తప్పనిసరి. దీన్ని ఆసరా చేసుకొని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు నిర్మాణం నిబంధనల ప్రకారం ఉన్నా.. లేదని అడ్డంగా వాదిస్తున్నారని ఓ డెవలపర్ ‘సాక్షి రియల్టీ’తో వాపోయారు. 4 వారాల్లో జారీ చేయాల్సిన ఎన్వోసీని 4 నెలలైనా ఫైలు ముందుకు కదల్చట్లేదని తెలిపారు. సుమారు 15 మంది డెవలపర్ల ఫైలు అగ్నిమాపక శాఖ ఎన్వోసీ కోసం ఎదురుచూస్తున్నాయని సమాచారం. కొందరు డెవలపర్లయితే న్యాయం కోసం కోర్టునూ ఆశ్రయిస్తున్నారు. డెవలపర్లకు అనుకూలంగా కోర్టు తీర్పు నిచ్చినా.. దాన్ని కూడా ఉన్నతాధికారులు బేఖాతరు చేస్తూ డెవలపర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ⇔ ఓ నిర్మాణ సంస్థ నగరంలో లక్ష చ.అ.ల్లో పోడియం ఆకారంలో వాణిజ్య సముదాయానికి శ్రీకారం చుట్టింది. ఎన్వోసీ జారీ కోసం అగ్నిమాపక శాఖకు దరఖాస్తు చేసుకుంది. నిబంధనల్నీ పక్కాగా ఉన్నాయి కూడా. 4 నెలలైనా ఫైలు ముందుకు కదలకపోవటంతో ఇదేంటని సంబంధిత ఉన్నతాధికారిని కలిస్తే.. మొదటి అంతస్తు నుంచే 11 మీటర్ల సెట్‌బ్యాక్‌ను వదలాలని మెలిక పెట్టారని వాపోయారు. 168 జీవో ప్రకారం.. పోడియం ఆకారంలో నిర్మాణాలకు 5వ అంతస్తు వరకు 9 మీటర్ల సెట్‌బ్యాక్, ఆపైన 5 అంతస్తుల వరకు 1 మీటర్ సెట్‌బ్యాక్ వదలాలనే నిబంధన ఉంది. కానీ, జీవోతో తనకు సంబంధం లేదని తాను చెప్పినట్టు వదిలితేనే ఎన్వోసీ జారీ చేస్తానని ఉన్నతాధికారి వాదిస్తుండటంతో డెవలపర్‌కు ఏం చేయాలో పాలుపోవట్లేదు. పోనీ ఉన్నతాధికారి చెప్పినట్లు 11 మీటర్ల సెట్‌బ్యాక్ వదిలితే స్థల యజమాని నష్టపోవటమే కాకుం డా బిల్టప్ ఏరియా తక్కువొస్తుందని, నిర్మాణ వ్యయం పెరుగుతుందని డెవలపర్ వాదన. గతంలో ఇలాంటి నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఇదే ఉన్నతాధికారి.. ఇప్పుడు సెట్‌బ్యాక్ మెలిక పెట్టడం గమనార్హం. -
చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ
♦ నేడు కోర్టు తీర్పు ♦ పోయెస్ గార్డెన్‌కు పోటెత్తిన అభిమానం ♦ కార్యకర్తల్లోకి శశికళ ♦ భద్రత మరింత కట్టుదిట్టం అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో వెలువడే తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ చిన్నమ్మ శశికళ మద్దతుదారుల్లో నెలకొంది. దీంతో రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సోమవారం చిన్నమ్మకు మద్దతుగా పోయెస్‌గార్డెన్‌కు అభిమానులు పోటెత్తారు. గార్డెన్ నుంచి బయటకు వచ్చిన శశికళ కార్యకర్తలతో ముచ్చటించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ సమరంలో ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వంకు మద్దతుగా ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, తారలు, మాజీ ఎమ్మెల్యేలు గ్రీన్ వేస్ రోడ్డు వైపుగా కదులుతున్నారు. పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానుల తాకిడి రెండు రోజులుగా గ్రీన్‌వేస్ రోడ్డు వైపుగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం చిన్నమ్మ కువత్తూరు వేదికగా చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం అన్నాడీఎంకే కింది స్థాయి కార్యకర్తల్ని, నాయకులను కదిలించినట్టుంది. రెండు రోజులుగా అంతంత మాత్రంగానే పోయెస్‌గార్డెన్ పరిసరాల్లో సందడి నెలకొనగా, ప్రస్తుతం అభిమాన కెరటం పోటెత్తుతోంది. శశికళకు మద్దతుగా తండోపతండాలుగా కార్యకర్తలు తరలి రావడంతో ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. ముందుగా పార్టీ ముఖ్యులతో మాట్లాడే క్రమంలో అమ్మ జయలలిత వెన్నంటి ఉంటూ తాను చేసిన సేవలు, అందించిన సహకారాన్ని వివరించారు. పన్నీరు రూపంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ, ఆ శిబిరం ఎత్తులను చిత్తు చేస్తూ, అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఒకే మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. క్రమంగా అభిమాన తాకిడి పెరగడంతో శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బయటకు రాక తప్పలేదు. కార్యకర్తల్లో చొచ్చుకు వస్తూ, వారితో ముచ్చటించారు. కార్యకర్తల మ«ధ్యలో నిలబడి మరీ ప్రసంగ పాఠంతో ఆకర్షించే యత్నం చేశారు. పోయెస్ గార్డెన్ నుంచి కువత్తూరుకు వెళ్లే మార్గంలో ప్రజాకర్షణ దిశలో చిన్నమ్మ పయనం సాగినా, చిన్నమ్మ ప్రసంగాలు ఆకర్షించే విధంగా ఉన్నా, మంగళవారం వెలువడబోయే తీర్పుపై ఆమె మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ మాత్రం తప్పడం లేదు. చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ: అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించనుంది. మంగళవారం పదిన్నర గంటలకు తీర్పును ప్రకటించనున్నట్టు సుప్రీంకోర్టులో నుంచి వెలువడ్డ ప్రకటనతో చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న ఆందోళన బయల్దేరింది. చిన్నమ్మకు అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందో అన్న చర్చ మీడియాల్లో సైతం పెరగడంతో తీర్పుపై ఆసక్తి పెరిగింది. తీర్పు వ్యతిరేకంగా ఉన్న పక్షంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఏదేని సంఘటనలు చోటు చేసుకోవచ్చన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భద్రత పెంచుతూ, ప్రధాన ప్రాంతాల్లో చెక్ పోస్టులు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
జీవోపై కోర్టుకెక్కింది వీరే
న్యాల్కల్: 123 జీవో కోర్టు తీర్పు మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్లో భూ బాధితులు, కూలీల్లో ఆనందాన్ని నింపింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న నిమ్జ్‌కు పెద్ద ఎత్తున భూమిని సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం ఇక్కడ కూడా 123 జీవో ప్రకారం భూసేకరణకు దిగగా, రైతు కూలీ సంఘం నాయకులు మోహన్ , రాజు, తుక్కమ్మ తదితరులు గత జూన్ లో హైకోర్టును ఆశ్రరుుంచారు. నిమ్జ్ భూ బాధితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం అందించాలని తీర్పు వెలువరించడంతో రైతులు, కూలీలతోపాటు అఖిల పక్షం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. న్యాల్కల్ మండలంలోని 14 గ్రామాలతోపాటు ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 12,635 ఎకరాలు నిమ్జ్ పేరుతో భూములను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణరుుంచారుు. మొదటి విడతగా ఝరాసంగం మండలం బర్దీపూర్, ఎల్గోరుు, చీలపల్లి, చీలపల్లి తండాతో పాటు న్యాల్కల్ మండలం ముంగి, ముంగి తండా, రుక్మాపూర్, రుక్మాపూర్ తండాలను ఎంపిక చేశారు. అధికారులు ఆయా గ్రామాల పరిధిలోని పట్టా, అసైన్ ్డ భూముల వివరాలను సేకరించారు. పట్టా భూములకు ఎకరానికి రూ:5.80 లక్షలు, అసైన్ ్డ భూమికి ఎకరాకు రూ.3 లక్షల పైచిలుకు చెల్లించారు. అరుుతే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భూములు సేకరిస్తుందని నిమ్జ్ భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు ఆందోళనకు దిగారు. 123 జీఓను రద్దు చేసి 2013 చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ రైతు కూలీ సంఘం నాయకులు మోహన్ , రాజు, తుక్కమ్మ తదితరులు గత జూన్ లో హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. తీర్పు రైతులకు, కూలీలకు అనుకూలంగా రావడంతో బాధిత రైతులు, కూలీల్లో సంతోషం వ్యక్తమైంది. -
మగతనం తొలగించాలన్న న్యాయస్థానం
-
‘అమ్మ’య్య
కోర్టు తీర్పుతో సంబరాలు ఆనంద డోలికల్లో అన్నాడీఎంకే రాష్ట్రమంతా పండుగ వాతావరణం 17వ తేదీలోగా సీఎంగా జయ చెన్నై, సాక్షి ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, ఎమ్మెల్యే పదవి, తద్వారా సీఎంగా పదవీచ్యుతురాలు కావడం, ఎన్నికల్లో పోటీచేసే అర్హతను కోల్పోవడం అన్నాడీఎంకే శ్రేణులను తీవ్రంగా కలచివేసింది. కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన గత ఏడాది అక్టోబరు నాటి నుంచి అన్నాడీఎంకే సంక్షోభంలో పడిపోయింది. జయ స్థానంలో ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం పదవీ బాధ్యతలు చేపట్టినా డమ్మీ సీఎం అంటూ పార్టీ విమర్శల పాలైంది. కర్ణాటక హైకోర్టులో జయ అప్పీలు కేసు తీర్పు వెలువడే వరకు భరించలేని ఉత్కంఠను ఎదుర్కొన్న అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోమవారం ఉదయం 6 గంటలకల్లా రోడ్లపైకి చేరుకున్నారు. రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం, పోయస్ గార్డెన్‌లోని జయ నివాసం పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రమైపోయాయి. జయను నిర్దోషిగా నిర్ధారిస్తూ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలవడగానే పార్టీలో ఆనందం మిన్నంటింది. పార్టీ కార్యాలయం, జయ నివాసం వద్ద అభిమానులు, పార్టీ నేతలు నృత్యాలు చేసి ఆనందించారు. వాహనాలను ఆపి మిఠాయిలు పంచిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కూడళ్లలో బాణ సంచా కాల్చి దీపావళిని తలపించారు. మహిళాభిమానులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోయస్ గార్డన్ ప్రవేశం వద్ద పోలీసులు బారీకేడ్లు వేసినా ప్రజలను అదుపుచేయలేకపోయారు. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, కొందరు మంత్రులు జయను కలిశారు. మదురై ఆదీనం స్వామిసహా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభిమానులు జయ ఇంటి వద్ద గుమికూడారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం బొకేలతో జయ నివాసం వద్ద బారులుతీరారు. జయ తీర్పు వెలువడే రోజైన సోమవారం సైతం రాష్ట్రంలో అనేక చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వలర్మతి సోమవారం తీర్పు వెలువడక ముందే కలశపూజ నిర్వహించారు. తిరుపోరూరులోని దర్గాలో ప్రార్థనలు జరిపారు. జయ నివాసం పోయస్‌గార్డెన్‌కు సమీపంలోని గోపాలపురంలోని డీఎంకే అధినేతి కరుణానిధి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తీర్పు తమ పార్టీకి ప్రతికూలం కావడంతో కరుణ, స్టాలిన్‌తో సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అలాగే ఆళ్వార్‌పేటలోని స్టాలిన్ ఇంటి వద్ద, డీఎంకే కేంద్ర కార్యాలయం అన్నా అరివాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడకుండా 144 సెక్షన్ విధించాలని డీఎండీకే అధినేత విజయకాంత్ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. సమత్తువ మక్కల్ కట్చి అధినేత శరత్‌కుమార్ జయకు శుభాకాంక్షలు చెప్పారు. -
కోర్టు తీర్పు ప్రజా విజయం
కొత్తవలస, న్యూస్‌లైన్ : మహిళా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా విజయమని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆదివారం స్థానిక ఎన్జీఓ సామాజిక భవనంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, కార్మిక సంఘ నాయకులు ఎం. గోపాలం, కె. సన్యాసిరావు మాట్లాడుతూ, కొత్తవలస మేజర్‌పంచాయతీ పరిధిలోని చింతలదిమ్మసమీపంలో ఉన్న ఉమాజూట్ ప్రొడక్టు కర్మాగారంలో శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్ వర్కర్స్ యూనియన్ జూట్ మిల్లు ను కొత్తగా ఏర్పాటు చేశారన్నారు. ఈ మిల్లులో పనిచేస్తున్న ఏడుగురు మహిళా కార్మికుల జీతంలో యాజ మాన్యం కోత విధించిందని తెలిపారు. 2010 అక్టోబర్ నుంచి 2011 ఫిబ్రవరి వరకు లక్షా 43 వేల 774 రూపాయలు కోత విధించడంపై కోర్టు నాశ్రయించినట్లు చెప్పారు. దీంతో వాదోపవాదాలు తర్వాత కోత విధించిన సొమ్ముకు రెట్టింపు కార్మికులకు అందజేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. కార్మికుల శ్రమను దోచుకోవడానికి చూసిన ఏ యాజమాన్యానికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు డి.శ్రీనివాస్, సీహెచ్.లక్ష్మి, లెంక శ్రీనివాస్, పలువురు కార్మికులు పాల్గొన్నారు.