ధర్నా చేస్తున్న బాధితురాలు దీపిక
బంజారాహిల్స్: కోర్టు తీర్పు ఇచ్చినా అత్తింటి వారు తనకు ఆశ్రయం కల్పించకపోగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువతి భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్‌కు చెందిన నారాయణరెడ్డి, మంగమ్మ దంపతుల కుమార్తె దీపికకు 2012లో నందినగర్‌కు చెందిన రామిడి శ్రీనివాసరెడ్డితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శ్రీనివాసరెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వారి మధ్య గొడవలు చోటు చేసుకోడంతో అతను భార్యను ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. దీనిపై బాధితురాలు మేడిపల్లి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
దీపికకు నెలకు రూ.6వేల చొప్పున భరణం ఇస్తూ ఇంట్లో ఆశ్రయం కల్పించాల్సిందిగా న్యాయస్థానం శ్రీనివాసరెడ్డిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం దీపిక భర్త ఇంటికి వెళ్లగా కుటుంబసభ్యులు ఆమెను ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో బంధువులు, మహిళా మండలి సభ్యులతో కలిసి ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ విషయమై ఇప్పటికే 13 కేసులు నమోదై ఉన్నాయి. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనూ నమోదైన కేసులపై కోర్టులో విచారణ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment