అగ్నిమాపక శాఖ సెట్‌బ్యాక్ మెలిక
⇔ ఎన్‌వోసీ జారీలో తీవ్ర జాప్యం
⇔ నిబంధనల ప్రకారం ఉన్నా.. లేదని వాదన
⇔ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న డెవలపర్లు
⇔ కోర్టు తీర్పునూ బేఖాతరంటున్న అధికారులు
⇔ మొత్తంగా ప్రాజెక్ట్‌ల ఆరంభం ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉద్యోగ అవకాశాలను కల్పించేది నిర్మాణ రంగం. పన్నుల రూపంలో ఖజానాకు కోట్లాది రూపాయలను సమకూర్చి.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేది కూడా ఈ రంగమే! ఇంతటి ప్రాధాన్యమున్న నిర్మాణ రంగం ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వానిది చిన్నచూపేనని నిర్మాణ సంస్థల ఆరోపణ. ఎవరి వాదనేంటో ఓ సారి చూద్దాం.
⇔ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ) జారీలో అధికారులు డెవలపర్లను తీవ్రంగా వేధిస్తున్నారని.. వాస్తవానికి నిర్మాణ అనుమతులకు పలు విభాగాల ఎన్‌వోసీలు అవసరం లేదని.. ఒకే ఒక్క ఎన్‌వోసీ చాలని ఓ స్థిరాస్తి సంఘం ప్రాపర్టీ షోలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్‌వోసీ మాత్రమే కాదు నిర్మాణ రంగాన్ని వేధిస్తున్న పలు నిబంధనల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పలుమార్లు ప్రస్తావించారు కూడా. కానీ, సంబంధిత ప్రభుత్వ అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని నిర్మాణ సంస్థల వాదన.
⇔ బహుళ అంతస్తుల భవనాలకు, వాణిజ్య సముదాయాలకు అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ తప్పనిసరి. దీన్ని ఆసరా చేసుకొని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు నిర్మాణం నిబంధనల ప్రకారం ఉన్నా.. లేదని అడ్డంగా వాదిస్తున్నారని ఓ డెవలపర్ ‘సాక్షి రియల్టీ’తో వాపోయారు. 4 వారాల్లో జారీ చేయాల్సిన ఎన్‌వోసీని 4 నెలలైనా ఫైలు ముందుకు కదల్చట్లేదని తెలిపారు. సుమారు 15 మంది డెవలపర్ల ఫైలు అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ కోసం ఎదురుచూస్తున్నాయని సమాచారం. కొందరు డెవలపర్లయితే న్యాయం కోసం కోర్టునూ ఆశ్రయిస్తున్నారు. డెవలపర్లకు అనుకూలంగా కోర్టు తీర్పు నిచ్చినా.. దాన్ని కూడా ఉన్నతాధికారులు బేఖాతరు చేస్తూ డెవలపర్లకు చుక్కలు చూపిస్తున్నారు.
⇔ ఓ నిర్మాణ సంస్థ నగరంలో లక్ష చ.అ.ల్లో పోడియం ఆకారంలో వాణిజ్య సముదాయానికి శ్రీకారం చుట్టింది. ఎన్‌వోసీ జారీ కోసం అగ్నిమాపక శాఖకు దరఖాస్తు చేసుకుంది. నిబంధనల్నీ పక్కాగా ఉన్నాయి కూడా. 4 నెలలైనా ఫైలు ముందుకు కదలకపోవటంతో ఇదేంటని సంబంధిత ఉన్నతాధికారిని కలిస్తే.. మొదటి అంతస్తు నుంచే 11 మీటర్ల సెట్‌బ్యాక్‌ను వదలాలని మెలిక పెట్టారని వాపోయారు. 168 జీవో ప్రకారం.. పోడియం ఆకారంలో నిర్మాణాలకు 5వ అంతస్తు వరకు 9 మీటర్ల సెట్‌బ్యాక్, ఆపైన 5 అంతస్తుల వరకు 1 మీటర్ సెట్‌బ్యాక్ వదలాలనే నిబంధన ఉంది. కానీ, జీవోతో తనకు సంబంధం లేదని తాను చెప్పినట్టు వదిలితేనే ఎన్‌వోసీ జారీ చేస్తానని ఉన్నతాధికారి వాదిస్తుండటంతో డెవలపర్‌కు ఏం చేయాలో పాలుపోవట్లేదు. పోనీ ఉన్నతాధికారి చెప్పినట్లు 11 మీటర్ల సెట్‌బ్యాక్ వదిలితే స్థల యజమాని నష్టపోవటమే కాకుం డా బిల్టప్ ఏరియా తక్కువొస్తుందని, నిర్మాణ వ్యయం పెరుగుతుందని డెవలపర్ వాదన. గతంలో ఇలాంటి నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఇదే ఉన్నతాధికారి.. ఇప్పుడు సెట్‌బ్యాక్ మెలిక పెట్టడం గమనార్హం.