కోర్టు తీర్పు ప్రజా విజయం
Published Mon, Dec 2 2013 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
కొత్తవలస, న్యూస్‌లైన్ : మహిళా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా విజయమని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆదివారం స్థానిక ఎన్‌జీఓ సామాజిక భవనంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, కార్మిక సంఘ నాయకులు ఎం. గోపాలం, కె. సన్యాసిరావు మాట్లాడుతూ, కొత్తవలస మేజర్‌పంచాయతీ పరిధిలోని చింతలదిమ్మసమీపంలో ఉన్న ఉమాజూట్ ప్రొడక్టు కర్మాగారంలో శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్ వర్కర్స్ యూనియన్ జూట్ మిల్లు ను కొత్తగా ఏర్పాటు చేశారన్నారు.
ఈ మిల్లులో పనిచేస్తున్న ఏడుగురు మహిళా కార్మికుల జీతంలో యాజ మాన్యం కోత విధించిందని తెలిపారు. 2010 అక్టోబర్ నుంచి 2011 ఫిబ్రవరి వరకు లక్షా 43 వేల 774 రూపాయలు కోత విధించడంపై కోర్టు నాశ్రయించినట్లు చెప్పారు. దీంతో వాదోపవాదాలు తర్వాత కోత విధించిన సొమ్ముకు రెట్టింపు కార్మికులకు అందజేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. కార్మికుల శ్రమను దోచుకోవడానికి చూసిన ఏ యాజమాన్యానికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు డి.శ్రీనివాస్, సీహెచ్.లక్ష్మి, లెంక శ్రీనివాస్, పలువురు కార్మికులు పాల్గొన్నారు.
Advertisement