కోర్టు తీర్పుతో సంబరాలు
ఆనంద డోలికల్లో అన్నాడీఎంకే
రాష్ట్రమంతా పండుగ వాతావరణం
17వ తేదీలోగా సీఎంగా జయ
చెన్నై, సాక్షి ప్రతినిధి :
మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, ఎమ్మెల్యే పదవి, తద్వారా సీఎంగా పదవీచ్యుతురాలు కావడం, ఎన్నికల్లో పోటీచేసే అర్హతను కోల్పోవడం అన్నాడీఎంకే శ్రేణులను తీవ్రంగా కలచివేసింది. కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన గత ఏడాది అక్టోబరు నాటి నుంచి అన్నాడీఎంకే సంక్షోభంలో పడిపోయింది. జయ స్థానంలో ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం పదవీ బాధ్యతలు చేపట్టినా డమ్మీ సీఎం అంటూ పార్టీ విమర్శల పాలైంది. కర్ణాటక హైకోర్టులో జయ అప్పీలు కేసు తీర్పు వెలువడే వరకు భరించలేని ఉత్కంఠను ఎదుర్కొన్న అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోమవారం ఉదయం 6 గంటలకల్లా రోడ్లపైకి చేరుకున్నారు. రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం, పోయస్ గార్డెన్‌లోని జయ నివాసం పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రమైపోయాయి.
జయను నిర్దోషిగా నిర్ధారిస్తూ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలవడగానే పార్టీలో ఆనందం మిన్నంటింది. పార్టీ కార్యాలయం, జయ నివాసం వద్ద అభిమానులు, పార్టీ నేతలు నృత్యాలు చేసి ఆనందించారు. వాహనాలను ఆపి మిఠాయిలు పంచిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కూడళ్లలో బాణ సంచా కాల్చి దీపావళిని తలపించారు. మహిళాభిమానులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోయస్ గార్డన్ ప్రవేశం వద్ద పోలీసులు బారీకేడ్లు వేసినా ప్రజలను అదుపుచేయలేకపోయారు. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, కొందరు మంత్రులు జయను కలిశారు. మదురై ఆదీనం స్వామిసహా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభిమానులు జయ ఇంటి వద్ద గుమికూడారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం బొకేలతో జయ నివాసం వద్ద బారులుతీరారు.
జయ తీర్పు వెలువడే రోజైన సోమవారం సైతం రాష్ట్రంలో అనేక చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వలర్మతి సోమవారం తీర్పు వెలువడక ముందే కలశపూజ నిర్వహించారు. తిరుపోరూరులోని దర్గాలో ప్రార్థనలు జరిపారు. జయ నివాసం పోయస్‌గార్డెన్‌కు సమీపంలోని గోపాలపురంలోని డీఎంకే అధినేతి కరుణానిధి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తీర్పు తమ పార్టీకి ప్రతికూలం కావడంతో కరుణ, స్టాలిన్‌తో సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అలాగే ఆళ్వార్‌పేటలోని స్టాలిన్ ఇంటి వద్ద, డీఎంకే కేంద్ర కార్యాలయం అన్నా అరివాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడకుండా 144 సెక్షన్ విధించాలని డీఎండీకే అధినేత విజయకాంత్ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. సమత్తువ మక్కల్ కట్చి అధినేత శరత్‌కుమార్ జయకు శుభాకాంక్షలు చెప్పారు.
‘అమ్మ’య్య
Published Tue, May 12 2015 3:36 AM | Last Updated on Fri, Jul 26 2019 5:49 PM
Advertisement
Advertisement