
అమరీందర్‌కు రిలీఫ్..
చండీగఢ్ : పదేళ్ల కిందట ప్రైవేట్ డెవలపర్‌కు భూమి బదలాయింపు కేసులో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సహా 17 మందికి విముక్తి లభించింది. నిందితుల్లో పంజాబ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, సహా ఇద్దరు మాజీ మంత్రులు మరణించారు. అమృత్‌సర్ ట్రస్ట్‌కు సంబంధించిన 32 ఎకరాల భూమిని ప్రైవేట్ డెవలపర్‌కు అభివృద్ధి పరిచే నిమిత్తం బదలాయించడంలో 18 మంది నిందితులు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని విజిలెన్స్ బ్యూరో (వీబీ) నివేదిక ఆధారంగా కేసును మూసివేస్తున్నట్టు మొహాలీ ప్రత్యేక న్యాయమూర్తి జస్వీందర్ సింగ్ స్పష్టం చేశారు.
పంజాబ్ అసెంబ్లీ సూచనతో 2008లో విజిలెన్స్ బ్యూరో వీరిపై కేసు నమోదు చేసింది. న్యాయస్ధానానికి హాజరైన అమరీందర్ సింగ్ ఇతర నిందితులు తీర్పును స్వాగతించారు. చివరికి న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు.
రాజకీయ కక్షసాధింపుతోనే తమపై విజిలెన్స్ బ్యూరోను ప్రేరేపించి కేసులో ఇరికించారని అప్పటి అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ అమరీందర్ సింగ్ అన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గిన విజిలెన్స్ బ్యూరో అధికారులపై ఎలాంటి చర్యలూ చేపట్టబోమని ఆయన స్పష్టం చేశారు.