భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన భూమిక నిర్వహించి, స్వతంత్ర భారత్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా దాదాపు 70 ఏళ్లుగా దేశానికి దిశానిర్దేశం చేసేలా దానిని తీర్చిదిద్దిన భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను అన్ని సందర్భాల్లోనూ తలుచుకుంటున్నాము. అయితే ఇప్పుడాయన మనదేశంలో∙ఓ స్టయిల్ ఐకాన్ గానూ చరిత్ర సృష్టిస్తున్నారు. లాటిన్ అమెరికా విప్లవయోధుడు చేగువేరా తరహాలో యువత ఆయనను సొంతం చేసుకున్నారు. ఆయన బొమ్మలు ఫోటోలు, బొమ్మలతో కూడిన డిజైనర్ బ్రేస్‌లెట్‌లు మొదలుకుని చేతివేళ్ల ఉంగరాలు, లాకెట్లు, చెవి రింగులు, చేతివాచ్‌లు, కార్ డాష్‌బోర్డ్ హ్యాంగర్లు,అంబేడ్కర్ చిత్రాలతో కూడిన డోర్»ñ ల్స్, నైట్‌లాంప్స్ చివరకు టీ షర్ట్‌ల వరకు విస్తృత ప్రచారంలోకి వచ్చాయి. అణగారిన దళిత వర్గాలు ముఖ్యంగా నవతరం అంబేడ్కర్‌ను తమ ఆరాధ్యుడిగా చేసుకోవడంతో పాటు వివిధ రూపాల్లో ఆయన ఆలోచనలు వ్యాప్తి చెందేలా చేస్తున్నారు.
తమ అస్తిత్వాన్ని గర్వంగా ఎత్తిచూపేందుకు ఆయనను ఓ ‘శైలి చిహ్నం’గా రూపొందేలా చేశారు. ఆకాశాన్నే హద్దుగా తీసుకోవాలనే సందేశాన్ని అట్టడుగు వర్గాలకు ఇవ్వడంలో భాగంగా ఆయన నీలంరంగు త్రీ పీస్ సూట్ ధరించేవారని అంబేడ్కరిస్టులు చెబుతుంటారు. ఇదే ఆయన శైలి ప్రకటనగా మారిపోయిందని యువతరం భావిస్తోంది. ప్రస్తుతం అంబేడ్కర్ ఫోటోలతో తయారైన వివిధ ఉపకరణాలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రధానంగా జయంతి, వర్థంతుల సందర్భంగా వీటి డిమాండ్ బాగా పెరుగు తున్న నేపథ్యంలో అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు బహుజన స్టోర్.కామ్, బహుజన ఉన్నతి స్టోర్.కామ్, జైభీమ్ ఇన్‌లైన్ స్టోర్.కామ్ వంటి కొత్త ఆన్‌లైన్‌స్టోర్లు ఇలాంటి వస్తువుల విక్రయంపై దృష్టి నిలిపాయి.
ఇండియాలో లక్షవరకు సంస్థలు...
‘అంబేడ్కర్ బొమ్మలతో కూడిన అలంకరణ వస్తువుల కోసం మార్కెట్ మొత్తం వెతికాను. అయితే నిరాశే ఎదురైంది. ఇలాంటి వస్తువులకు బాగా డిమాండ్ ఉండడాన్ని గమనించి దుకాణం మొదలుపెట్టాలనే ఆలోచన వచ్చింది. అంబేడ్కర్ ఆలోచనలు, సిద్ధాంతాల వ్యాప్తితో పాటు బిజినెస్ అవకాశాలు కూడా ఉండడంతో ప్రత్యేక బహుజన స్టోర్ ప్రారంభించాను’ అని మనోజ్‌కుమార్ తెలిపాడు. ఐటీరంగంలో మేనేజర్‌గా చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని 2015 ఆయన ఈ రంగంలోకి దిగాడు. తనకు రాజస్థాన్, మధ్యప్రదేశ్ మొదలుకుని కేరళ వరకు పెద్దమొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయని, అంబేడ్కర్ సందేశాలతో కూడిన డిజైనర్ టీషర్టులు అత్యధికంగా అమ్ముడవుతున్నట్టు చెప్పాడు. ఏడాదికి 30–40 శాతం చొప్పున తమ వ్యాపారం పెరుగుతోందని బహుజన ఉన్నతి స్టోర్ సీఈఓ విష్ణు వెల్లడించాడు. ప్రస్తుతం అతడి ఆన్‌లైన్‌స్టోర్ 250 రకాల వస్తువులను మార్కెట్ చేస్తోంది. అంబేడ్కర్ ఆలోచనలతో ప్రభావితమైన ఇలాంటి సంస్థల సంఖ్య లక్ష వరకు చేరుకుందని,వాటిలో సగం వరకు కొత్తవి, అంబేడ్కర్‌ను స్టయిల్ ఐకాన్‌గా పరిగణిస్తున్న యువకులు నిర్వహిస్తున్నవేనని విష్ణు తెలిపాడు.
ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా ఈ వస్తువులతో పాటు అంబేద్కర్ రచనలు, ఉపన్యాసాలతో కూడిన సాహిత్యం కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. గత నెలరోజుల్లోనే లక్ష వరకు అంబేడ్కర్ టీ షర్టులకు విక్రయించినట్టు దళిత్ బుక్‌స్టోర్ నిర్వాహకుడు అనుజ్‌కుమార్ పేర్కొన్నాడు. మహిళలు సైతం చేతి ఒంగరాలు, చెవి రింగులు, అంబేద్కర్ ఫోటోలతో కూడిన చీరలు వంటివి కొనుగోలు చేస్తున్నారని మరో వ్యాపారి గౌతమ్ తెలిపాడు. ఆల్ ఇండియా భీమ్ ఫాలోవర్, భారతీయ మూల్‌నివాసి సంఘ్, ఆల్ ఇండియా అంబేడ్కర్ ఫ్రంట్, కారవాన్ వంటి దాదాపు 250 దళిత గ్రూపులతో మమేకమైన కారణంగా అనుజ్‌కుమార్‌కు ఎక్కువగా వాట్సాప్‌పైనే ఆర్డర్లు వస్తుంటాయి. అంబేద్కర్ ఇప్పుడు ‘గ్లోబల్ ఐకాన్’గా మారిపోయాడని, ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయానికి ప్రతీకగా కోట్లాది మందికి అంబేడ్కర్ స్ఫూర్తిధాతగా నిలుస్తున్నారని అందువల్లే ఇక్కడ ఫ్యాషన్ ఐకాన్‌గా మారారని జేఎన్‌యూ సోషియాలజీ ప్రొఫెసర్ వివేక్‌కుమార్ వివరించారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment