అంబేద్కర్ వర్శిటీ కొత్త క్యాంపస్ ప్రారంభం!
న్యూఢిల్లీః దేశరాజధాని నగరంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ను విద్యాశాఖ మంత్రి సిసోడియా ప్రారంభించారు. రాష్ట్ర నిధులతో ప్రారంభమైన యూనివర్శిటీగా 2008లో 1800 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. 2020 నాటికి మరో రెండు క్యాంపస్ లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.
ఢిల్లీనగరంలోని కశ్మీర్ గేట్ ప్రాంతంలో నెలకొన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 40 అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్స్ ప్రోగ్రామ్ లను అందిస్తోంది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో 2.5 లక్షల మంది విద్యార్థులు పన్నెండో తరగతి పూర్తి చేస్తే, వారిలో సగానికి పైగా విద్యార్థులు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వివిధ కళాశాలలకు ఉన్నత విద్యకు వెళుతున్నారని కరంపుర ప్రాంతంలో క్యాంపస్ ప్రారంభోత్సవ సందర్భంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు.
విద్యార్థుల్లో చాలామంది డ్రాపవుట్స్ గా మారడం, ఢిల్లీనుంచి ఇతర ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్ళడం, లేదా ప్రైవేట్ కళాశాలల్లో భారీ మొత్తంలో ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందడం చేస్తున్నారని, అటువంటివారికి సదుపాయం కల్పించాలన్న ఆలోచనలోనే 2020 నాటికి రోహిణి, ధీర్ పురేర్ ప్రాంతాల్లో మరో రెండు క్యాంపస్ లు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సిసోడియా తెలిపారు. విద్యాశాఖా మంత్రిగా కూడా ఉన్న సిసోడియా.. మరింతమంది విద్యార్థులకు స్థానం కల్పించడంతోపాటు.. విద్యా ప్రమాణాలను పెంచడానికి వారికి కావలసిన బోధనా సిబ్బంది, విద్యాలయాధికారులను సైతం నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మొత్తం 26 లక్షల మంది విద్యార్థుల్లో.. ప్రభుత్వ పాఠశాలల్లోని 16 లక్షల మందితోపాటు.. మొత్తం 2.5 లక్షలమంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారని, ప్రతి సంవత్సరం 10 నుంచి 100 వరకూ సీట్లు పెంచడం సరికాదని చెప్పారు. సీట్లను పెంచడంతోపాటు.. విద్యాప్రమాణాలను కూడా పెంచాలని మంత్రి నొక్కి వక్కాణించారు. అయితే ఇటీవల ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా కొత్తగా నిర్మించిన కళాశాల భవనాలను ప్రారంభించిన సందర్భంలో.. అరవింద్ కేజ్రీవాల్ మోదీని విమర్శిస్తూ ట్వీట్లు కూడా చేసిన సంతగి తెలిసిందే.