
బెంగాల్‌లో హింసకు దీదీదే బాధ్యత : అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతాలో మంగళవారం జరిగిన తన ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ పధకం ప్రకారం హింసకు పాల్పడిందని బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోపించారు. హింసతో తమను అణగదొక్కలేరని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న దీదీకి బెంగాలీలు ఓటమి రుచిచూపుతారని ఆయన హెచ్చరించారు. రోడ్‌షో సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలను గుర్తుచేసుకున్న అమిత్ షా తాను అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డానని, సీఆర్‌పీఎఫ్ బలగాలు అక్కడ లేకుంటే తాను తప్పించుకోవడం కష్టమయ్యేదని ఆందోళన వ్యక్తం చేశారు.
తన రోడ్‌షోపై తృణమూల్ కాంగ్రెస్ బాహాటంగా అక్కసు వెళ్లగక్కిందని, ప్రధాని మోదీ పోస్టర్లు, తన పోస్టర్లను తృణమూల్ కార్యకర్తలు చించివేశారని, అయినా బీజేపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. రోడ్‌షోకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని అన్నారు. రోడ్‌షో సందర్భంగా బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం, అమిత్ షాపై తృణమూల్ శ్రేణుల రాళ్ల దాడి, సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం కూల్చివేత ఘటనలు కలకలం రేపాయి.
కాగా, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థచే దర్యాప్తు జరిపించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. బెంగాల్‌లో హింసాకాండకు తృణమూల్ కాంగ్రెస్ బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. తృణమూల్ హింసకు ప్రేరేపిస్తోందన్న అమిత్ షా తన ఆరోపణలకు మద్దతుగా కొన్ని ఫోటోలను ప్రదర్శించారు.