
అలీగఢ్ : బీజేపీ నేతలను, కార్యకర్తలను రాష్ట్రంలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన చర్యలతో తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని బీజేపీ చీఫ్ అమిత్ షా బుధవారం హెచ్చరించారు. బెంగాల్‌లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక ఆమె బీజేపీ నేతలను అడ్డుకుంటున్నారని అలీగఢ్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో అమిత్ షా పేర్కొన్నారు.
బెంగాల్‌లో 42 లోక్‌సభ స్ధానాలకుగాను 23 స్దానాల్లో కమలం విరబూసేవరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించబోరని ఆమెకు తెలియదని స్పష్టం చేశారు. ‘బెంగాల్‌లో నిన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను అనుమతించకుండా అడ్డంకులు సృష్టించారు..నా హెలికాఫ్టర్ ల్యాండయ్యేందుకు అనుమతించలేదు..శివరాజ్ సింగ్ చౌహాన్‌కూ ఇదే పరిస్థితి ఎదురైంద’ని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని సభకు చిన్న మైదానం కేటాయించి, దానికి అనుమతులు సైతం అర్ధరాత్రి ఇచ్చారని మమతా సర్కార్‌పై ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ సత్తా చాటనుందనే ఆక్రోశంతోనే దీదీ ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీస్ అధికారికి వత్తాసు పలుకుతూ కోల్‌కతాలో మమతా బెనర్జీ ధర్నా చేయడం పట్ల అమిత్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment