‘నీర్జా’ అరుదైన యాడ్ విడుదల
గాంధీనగర్: సోనమ్ కపూర్ నటించిన హిందీ సినిమా ‘నీర్జా’ హిట్టవడంతో ఇప్పుడు నీర్జా భానోత్ నిజ జీవితంపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. 259 మంది ప్రయాణికులను రక్షించేందుకు తన 23వ పుట్టిన రోజుకు కొన్ని గంటల ముందు ప్రాణాలు అర్పించిన నీర్జాకు నివాళిగా పాల ఉత్పత్తుల సంస్థ ‘అముల్’ ఆమె 1980 దశకంలో నటించిన అతి అరుదైన యాడ్‌ను ఇప్పుడు పునర్ విడుదల చేసింది.
అముల్ చాక్లెట్‌కు సంబంధించిన ఆ యాడ్‌లో ‘త్రి చక్ర సైకిల్‌ను నడిపేందుకు చాలా పెద్దోడివి. పైలట్ అవడానికి చాలా చిన్నోడివి. అముల్ చాక్లెట్ తినేందుకు సరైన వయస్సు వాడివి’ అనే పాటను ఓ బాలుడితో కలసి పాడుతారు. నీర్జా పాన్ అమెరికా ఎయిర్‌వేస్‌లో చేరడానికి ముందు యాడ్స్‌లో మోడల్‌గా పనిచేశారు. బెంజర్ సారీస్, బినాకా టూత్ పేస్ట్, గోద్రెజ్ బెస్టో డిటర్జెంట్, వాపోరెక్స్, వీకో టర్మరిక్ , తదితర యాడ్స్‌లో ఆమె నటించారు.
నీర్జా ధైర్యసాహసాలకు మెచ్చిన భారత్ ప్రభుత్వం మరణానంతరం ఆమెకు అశోకచక్రను ప్రకటించింది. ఆ అవార్డు లభించిన తొలి పౌరురాలే కాకుండా అత్యంత పిన్న వయస్సులో ఈ అవార్డు లభించిన వ్యక్తిగా కూడా ఆమె పేరు రికార్డుల్లోకి ఎక్కింది.