
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిరసన కార్యక్రమంలో.. ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేసిన అమూల్య అనే యువతిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ క్రమంలో 14 రోజుల పాటు ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. కాగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఈ ర్యాలీకి హాజరయ్యారు. ఈ క్రమంలో అమూల్య లియోన్ అనే యువతి వేదికపై పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. దీంతో కంగుతిన్న నిర్వాహకులు ఆమె నుంచి మైక్ లాక్కుందామని ప్రయత్నించినా.. అమూల్య నినాదాలు కొనసాగించింది.
ఈ నేపథ్యంలో అమూల్య తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ విషయం గురించి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మాట్లాడుతూ.. అమూల్యకు బెయిలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఆమె తండ్రి సైతం తనను రక్షించేందుకు సిద్ధంగా లేనని చెప్పారన్నారు. ఆయన మాటల ద్వారా అమూల్యకు నక్సల్స్‌తో సంబంధం ఉందన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. తనకు తప్పకుండా తగిన శిక్ష పడుతుందని తెలిపారు. ఇక అమూల్య వ్యాఖ్యలకు నిరసనగా.. శ్రీరామ్ సేన, హిందూ జాగృతి సమితిసభ్యులు ఆందోళన చేపట్టారు. అమూల్య క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.(సీఏఏ నిరసనల్లో ‘పాక్ జిందాబాద్’ నినాదాలు)
ఇదిలా ఉండగా.. అమూల్య ఇంటిపై కొంతమంది వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా అమూల్య వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇక అమూల్యను చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా శివపుర గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. అలాగే అమూల్యను ఆ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానించారు.. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాల వెనుక కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment