
బినామీ ఖాతాలోకి రూ.246 కోట్లు!
► నోట్ల రద్దు సమయంలో భారీగా డిపాజిట్
► మరో 441 అనుమానాస్పద ఖాతాల్లో రూ.240 కోట్ల చేరిక
చెన్నై: నోట్ల రద్దు సమయంలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై కన్నేసిన ఐటీ అధికారులు ఒక్కొక్క కేసునూ బయటకు లాగుతున్నారు. నవంబర్ 8నాటి ప్రధాని నిర్ణయం తర్వాత తమిళనాడుకు చెందిన ఓ ఖాతాలోకి ఒకేసారి రూ. 246 కోట్లు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. నోట్లరద్దు సమయంలో ఒక ఖాతాలో చేరిన అతిపెద్ద మొత్తం ఇదే. ఈ ఖాతాదారుడి (వివరాలు వెల్లడించలేదు)ని ఐటీ అధికారులు విచారించగా.. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో చేరి ఈ మొత్తానికి పన్ను, జరిమానా చెల్లించేందుకు అంగీకరించారు.
అయితే ఆ వ్యక్తి వివరాలు వెల్లడించనప్పటికీ తమిళనాడుకు చెందిన బడా రాజకీయ నేత అని తెలుస్తోంది. తమిళనాడులోని మరో 441 అనుమానాస్పద ఖాతాల్లోకి రూ.240 కోట్లు డిపాజిట్ అయినట్లు కూడా విచారణలో తేలింది. ఈ అకౌంట్లు ఎవరివి అనే దానిపై బ్యాంకు అధికారుల వద్ద వివరాల్లేవు. అనుమానాస్పద 27,739 ఖాతాలను గుర్తించిన అధికారులు లావాదేవీలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనికి 18,220 మంది వివరణ ఇవ్వగా మిగిలిన వారినుంచి స్పందన లేదు. బ్యాంకు అధికారుల సాయం లేకుండా ఇంత భారీ లావాదేవీలు జరగటం అసాధ్యమనే అంశంపైనా అధికారులు దృష్టిపెట్టారు.