Termination of banknotes
-
రుణాలు చెల్లించలేకపోవడానికి నోట్ల రద్దే కారణం
న్యూఢిల్లీ: బ్యాంకులకు సుమారు రూ.20,000 కోట్ల వరకు రుణ బకాయి పడి, చెల్లింపుల్లో విఫలమైన వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఎన్సీఎల్టీ ముందు కొత్త వాదనలు వినిపించింది. తమ కంపెనీ వ్యాపారం దెబ్బతిని రుణాలు చెల్లించలేకపోవడానికి మోదీ సర్కారు నోట్ల రద్దు, 2జీ స్కామ్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, బ్రెజిల్ ప్రభుత్వాల పాత్రను వీడియోకాన్ తరఫు న్యాయవాది వినిపించారు. కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలను కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ గత వారం ఆమోదించిన విషయం తెలిసిందే. గతంలో సమయానికి రుణ చెల్లింపులు చేసిన చరిత్ర కంపెనీకి ఉందని, ప్రస్తుతం చెల్లింపుల్లో విఫలం అవడానికి ఊహించని పరిస్థితులే కారణమని వీడియోకాన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ‘‘మోడీ ప్రభుత్వం తీసుకున్న డీమోనిటైజేషన్ నిర్ణయం మా సీఆర్టీ టెలివిజన్ల వ్యాపారాన్ని ముంచేసింది. సరఫరాదారులు ముడి సరుకులను సరఫరా చేయలేకపోయారు. దీంతో ఆ వ్యాపారం గణనీయంగా తగ్గిపోవడంతో మూసేయాల్సి వచ్చింది’’ అని కోర్టుకు తెలిపారు. ఇక, 2012లో సుప్రీంకోర్టు 100కుపైగా 2జీ లైసెన్స్‌లను రద్దు చేసిందని, అందులో వీడియోకాన్ లైసెన్స్‌లు 21 వరకు ఉండటంతో భారీగా నష్టపోవాల్సి వచ్చిందని, బ్యాంకులకు చెల్లింపులు చేయలేకపోయినట్టు వివరించారు. బ్రెజిల్ పెట్రోలియంతో కలసి జాయింట్ వెంచర్ కింద ఆయిల్, గ్యాస్ వ్యాపార నిర్వహణకు అక్కడి ప్రభుత్వ అనుమతిలో జాప్యం చేయడంతో నష్టాలు వచ్చినట్టు తెలిపారు. -
ప్రజల వద్ద 18.5 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న నగదు స్థాయి గరిష్టానికి చేరుకుందనీ, 2016లో నోట్ల రద్దు తర్వాత జనం చేతుల్లో ఉన్న డబ్బుకు రెండింతలకుపైగా ఇప్పుడు ఉందని ఆర్బీఐ పేర్కొంది. 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి పాత రూ.1,000, పాత రూ. 500 నోట్లను ప్రభుత్వం చలామణి నుంచి ఉపసంహరించడం తెలిసిందే. 2016 డిసెంబర్ 9 నాటికి ప్రజల వద్ద ఉన్న నోట్ల విలువ 7.8 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది మే 25 నాటికి 18.5 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు జనం దగ్గర ఉన్నా యని ఆర్బీఐ వెల్లడించింది. అలాగే నోట్లరద్దు అనంతర రోజులతో పోలిస్తే ప్రస్తుతం రెండింతలకు పైగా నగదు చలామణిలో ఉందంది. 2017 జనవరి 6 నాటికి రూ. 8.9 లక్షల కోట్లు చలామణిలో ఉండగా, ఈ నెల 1 నాటికి అది రూ. 19.3 లక్షల కోట్లకు చేరుకుందంది. ప్రజల్లో ఉన్న నగదు, బ్యాంకుల వద్ద ఉన్న నగదు.. రెండింటినీ కలిపి చలామణిలో ఉన్న నగదుగా పరిగణిస్తారు. రెండు, మూడు నెలల క్రితం అనేక రాష్ట్రాల్లో నగదు కొరత ఏర్పడినా, ఆర్బీఐ గణాంకాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. కొందరు వ్యక్తులు వివిధ కారణాలతో భారీ స్థాయిలో డబ్బును బ్యాంకుల నుంచి ఉపసంహరించుకుని, చలామణిలోకి తేకుండా దాచిపెట్టడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
బినామీ ఖాతాలోకి రూ.246 కోట్లు!
► నోట్ల రద్దు సమయంలో భారీగా డిపాజిట్ ► మరో 441 అనుమానాస్పద ఖాతాల్లో రూ.240 కోట్ల చేరిక చెన్నై: నోట్ల రద్దు సమయంలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై కన్నేసిన ఐటీ అధికారులు ఒక్కొక్క కేసునూ బయటకు లాగుతున్నారు. నవంబర్ 8నాటి ప్రధాని నిర్ణయం తర్వాత తమిళనాడుకు చెందిన ఓ ఖాతాలోకి ఒకేసారి రూ. 246 కోట్లు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. నోట్లరద్దు సమయంలో ఒక ఖాతాలో చేరిన అతిపెద్ద మొత్తం ఇదే. ఈ ఖాతాదారుడి (వివరాలు వెల్లడించలేదు)ని ఐటీ అధికారులు విచారించగా.. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో చేరి ఈ మొత్తానికి పన్ను, జరిమానా చెల్లించేందుకు అంగీకరించారు. అయితే ఆ వ్యక్తి వివరాలు వెల్లడించనప్పటికీ తమిళనాడుకు చెందిన బడా రాజకీయ నేత అని తెలుస్తోంది. తమిళనాడులోని మరో 441 అనుమానాస్పద ఖాతాల్లోకి రూ.240 కోట్లు డిపాజిట్ అయినట్లు కూడా విచారణలో తేలింది. ఈ అకౌంట్లు ఎవరివి అనే దానిపై బ్యాంకు అధికారుల వద్ద వివరాల్లేవు. అనుమానాస్పద 27,739 ఖాతాలను గుర్తించిన అధికారులు లావాదేవీలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనికి 18,220 మంది వివరణ ఇవ్వగా మిగిలిన వారినుంచి స్పందన లేదు. బ్యాంకు అధికారుల సాయం లేకుండా ఇంత భారీ లావాదేవీలు జరగటం అసాధ్యమనే అంశంపైనా అధికారులు దృష్టిపెట్టారు.