న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న నగదు స్థాయి గరిష్టానికి చేరుకుందనీ, 2016లో నోట్ల రద్దు తర్వాత జనం చేతుల్లో ఉన్న డబ్బుకు రెండింతలకుపైగా ఇప్పుడు ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి పాత రూ.1,000, పాత రూ. 500 నోట్లను ప్రభుత్వం చలామణి నుంచి ఉపసంహరించడం తెలిసిందే. 2016 డిసెంబర్ 9 నాటికి ప్రజల వద్ద ఉన్న నోట్ల విలువ 7.8 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది మే 25 నాటికి 18.5 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు జనం దగ్గర ఉన్నా యని ఆర్‌బీఐ వెల్లడించింది.
అలాగే నోట్లరద్దు అనంతర రోజులతో పోలిస్తే ప్రస్తుతం రెండింతలకు పైగా నగదు చలామణిలో ఉందంది. 2017 జనవరి 6 నాటికి రూ. 8.9 లక్షల కోట్లు చలామణిలో ఉండగా, ఈ నెల 1 నాటికి అది రూ. 19.3 లక్షల కోట్లకు చేరుకుందంది. ప్రజల్లో ఉన్న నగదు, బ్యాంకుల వద్ద ఉన్న నగదు.. రెండింటినీ కలిపి చలామణిలో ఉన్న నగదుగా పరిగణిస్తారు. రెండు, మూడు నెలల క్రితం అనేక రాష్ట్రాల్లో నగదు కొరత ఏర్పడినా, ఆర్‌బీఐ గణాంకాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. కొందరు వ్యక్తులు వివిధ కారణాలతో భారీ స్థాయిలో డబ్బును బ్యాంకుల నుంచి ఉపసంహరించుకుని, చలామణిలోకి తేకుండా దాచిపెట్టడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment