benami account
-
మాజీ ఎమ్మెల్యే బినామీకి రూ.61 కోట్ల జరిమానా
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీలను బినామీల పేరిట లీజుకు పొందారు. అక్రమంగా ఖనిజ రవాణా చేస్తున్న ఆయన ఇన్నేళ్లు అధికారులను భయభ్రాంతులకు గురి చేసి క్వారీల వైపు రాకుండా తన చీకటి వ్యాపారాన్ని సాగించారు. ఇటీవలే గనులశాఖ అధికారులు ఆ మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌ను తనిఖీ చేసి రోడ్డు మెటల్ నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించి రూ.1.60 కోట్ల జరిమానా విధించిన విషయం విదితమే. తాజాగా మాజీ ఎమ్మెల్యే బినామీ పేరిట ఉన్న రోడ్డు మెటల్ క్వారీని గనుల శాఖ అధికారుల బృందం తనిఖీ చేసి.. అక్రమ తవ్వకాలను గుర్తించింది. అనంతపురం టౌన్: క్వారీల మాటున ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సాగిస్తున్న అక్రమ ఖనిజ రవాణా దందాలో కొండలను సైతం పిండి చేసేశారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా రోడ్డు మెటల్ తరలించి సొమ్ము చేసుకున్నారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు పొలం సర్వే నంబర్ 231లో 4.6 హెక్టార్ల రోడ్డు మెటల్ కొండకు ఆ మాజీ ఎమ్మెల్యే బినామీగా పేరున్న కె.సాంబశివుడు లీజు పొందారు. లీజు పొందిన ప్రాంతంలో రోడ్డు మెటల్ తవ్వకాలను చేపట్టి.. మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌కు తరలించారు. లీజు పొందిన ప్రాంతంలో ఖనిజ నిల్వలు తగ్గిపోవడంతో పక్కనే ఉన్న మరో 1.5హెక్టార్లలో లీజు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టి భారీగా రోడ్డు మెటల్ తరలించారు. ఏడాది కాలంగా ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా రోడ్డు మెటల్‌ను తన క్రషర్కు తరలించి భారీగా సోమ్ము చేసుకున్నట్లు గనులశాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. రూ.61.35 కోట్ల జరిమానా.. మాజీ ఎమ్మెల్యే బినామీ సాంబశివుడు క్వారీలో అక్రమ తవ్వకాలు చేసి రోడ్డు మెటల్ తరలించారు. దీంతో గనులశాఖ అధికారులు లీజు తీసుకున్న ప్రాంతానికి వెళ్లి కొలతలు తీశారు. లీజు ప్రాంతంతోపాటు పక్కనే ఉన్న మరో ప్రాంతంలో 1.5 హెక్టార్లలో అంటే 3.75 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి 6.35 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను తరలించినట్లు గుర్తించి క్వారీ నిర్వాహకునికి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు ఎటువంటి స్పందనా లేకపోవడంతో రూ.61.35 కోట్ల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తం చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేయడంతో పాటు రోడ్డు మెటల్ క్వారీని సీజ్ చేశారు. సీజ్ చేసినా ఆగని ఖనిజ రవాణా జరిమానా చెల్లించే వరకు ఖనిజం తవ్వకాలు చేపట్టరాదని గనులశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, క్వారీని సీజ్ చేసినా నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. క్వారీలో రాత్రి పూట అక్రమ తవ్వకాలు చేపట్టి రోడ్డు మెటల్‌ను మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌కు తరలిస్తున్నారు. సీజ్ చేసిన తర్వాత గనుల శాఖ అధికారులు క్వారీ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదే అదనుగా భావించిన క్వారీ నిర్వాహకులు తవ్వకాలు చేపట్టి ఖనిజాన్ని తరలిస్తున్నారు. గనులశాఖ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. పరిమితికి మించి తవ్వకాలు క్వారీ లీజు తీసుకున్న ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు చేపట్టి రోడ్డు మెటల్‌ను తరలించినట్లు గుర్తించాం. దాదాపు 6.35 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మెటల్ తరలించారు. దీంతో క్వారీ నిర్వాహకుడు సాంబశివుడికి రూ.61.35 కోట్ల జరిమానా విధించి క్వారీని సీజ్ చేశాం. సీజ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్న విషయం మాకు తెలియదు. మరోమారు క్వారీని పరిశీలిస్తాం. అక్రమంగా తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసుకు సిఫార్సు చేస్తాం. – నాగయ్య, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ -
బినామీ ఖాతాలోకి రూ.246 కోట్లు!
► నోట్ల రద్దు సమయంలో భారీగా డిపాజిట్ ► మరో 441 అనుమానాస్పద ఖాతాల్లో రూ.240 కోట్ల చేరిక చెన్నై: నోట్ల రద్దు సమయంలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై కన్నేసిన ఐటీ అధికారులు ఒక్కొక్క కేసునూ బయటకు లాగుతున్నారు. నవంబర్ 8నాటి ప్రధాని నిర్ణయం తర్వాత తమిళనాడుకు చెందిన ఓ ఖాతాలోకి ఒకేసారి రూ. 246 కోట్లు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. నోట్లరద్దు సమయంలో ఒక ఖాతాలో చేరిన అతిపెద్ద మొత్తం ఇదే. ఈ ఖాతాదారుడి (వివరాలు వెల్లడించలేదు)ని ఐటీ అధికారులు విచారించగా.. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో చేరి ఈ మొత్తానికి పన్ను, జరిమానా చెల్లించేందుకు అంగీకరించారు. అయితే ఆ వ్యక్తి వివరాలు వెల్లడించనప్పటికీ తమిళనాడుకు చెందిన బడా రాజకీయ నేత అని తెలుస్తోంది. తమిళనాడులోని మరో 441 అనుమానాస్పద ఖాతాల్లోకి రూ.240 కోట్లు డిపాజిట్ అయినట్లు కూడా విచారణలో తేలింది. ఈ అకౌంట్లు ఎవరివి అనే దానిపై బ్యాంకు అధికారుల వద్ద వివరాల్లేవు. అనుమానాస్పద 27,739 ఖాతాలను గుర్తించిన అధికారులు లావాదేవీలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనికి 18,220 మంది వివరణ ఇవ్వగా మిగిలిన వారినుంచి స్పందన లేదు. బ్యాంకు అధికారుల సాయం లేకుండా ఇంత భారీ లావాదేవీలు జరగటం అసాధ్యమనే అంశంపైనా అధికారులు దృష్టిపెట్టారు. -
బోధన్ స్కామ్‌లో ఐదుగురు నిందితుల గుర్తింపు
వీరి కోసం గాలిస్తున్నామన్న ఐజీ సౌమ్యామిశ్రా సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ రూపంలో రావాల్సిన కోట్ల రూపాయలను బినామీ ఖాతాలో్లకి మళ్లించిన బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ దర్యాప్తును సీఐడీ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని నిందితులుగా గుర్తిం చినట్లు ఐజీ సౌమ్యామిశ్రా శుక్రవారం తెలి పారు. వీరిలో ముగ్గురు కమర్షియల్ ట్యాక్స్ అధికారులుండగా... ఇద్దరు దళారులని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఓ ఉదంతంలోనే రూ.3.39 కోట్లు స్వాహా అయినట్లు గుర్తించామని మిగిలిన ఉదంతాల్లో గుర్తించా ల్సుందని పేర్కొన్నా రు. ఈ కేసు దర్యాప్తులో అనేక ఖాతాలను సరిచూడాల్సి ఉందని, దీంతో కమర్షియల్ ట్యాక్స్ విభాగం నుంచి నోడల్ అధికారి, కొందరు సహాయకులను నియమించామని పేర్కొన్నారు. నమో ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్న అంకిత్ మెహతాపై ఆశిష్ జైన్ న ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశామని ఐజీ తెలి పారు. తన తల్లి సరోజ జైన్ నుంచి మెహతా రూ.12.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనకు ప్రధాన మంత్రి కార్యాలయంలోనూ (పీఎంఓ) పలుకుబడి ఉన్నట్లు బాధితులకు చెప్పాడని, దీంతో వారు సీఐడీలో ఫిర్యాదు చేయడంతో పాటు పీఎంఓకూ లేఖ రాశారన్నారు. ఈ మోసానికి, ఫౌండేషన్ కు సంబంధం లేదని, అయితే బాధితులు మాత్రం ఆ సంస్థ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే మెహతాకు నగదు ఇచ్చినట్లు చెప్తున్నారని సౌమ్యామిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కూడా దర్యాప్తు స్థితిలో ఉందని వివరించారు. ఎంసెట్ లీకేజ్ స్కామ్‌లో ఇప్పటికే అనేక మంది నిందితుల్ని అరెస్టు చేశామని చెప్పిన ఐజీ బీహార్ కేంద్రంగా జరిగిన ఈ స్కామ్‌లో కీలక నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.