హత్యకు గురవ్వడానికి ముందు ఫోన్ లో స్నేహితులతో మాట్లాడుతున్న అంకిత్ సక్సేనా(ఇన్‌సెట్‌లో ఫైల్ ఫోటో)
న్యూ ఢిల్లీ : ఆ ప్రేమికులు ఇద్దరూ ఒకరికొరకు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కాని వారి మతాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. మతాంతర వివాహాలు నచ్చని యువతి తండ్రి యువకుడి గొంతు కోసి కిరాతకంగా చంపేశారు. మరణించడానికి ఏడు నిమిషాల ముందు యువకుడు అతడి స్నేహితులతో మాట్లాడుతున్న దృశ్యాలు సీసీకెమెరాకు చిక్కాయి.
వివరాలు.. ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల ఫోటోగ్రాఫర్ అంకిత్ సక్సేనా మరో మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. సదరు యువతి ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి అతన్నే వివాహం చేసుకుంటానని తేల్చిచెప్పింది. అనంతరం మతాలు వేరు అని తెలియడంతో యువతికి, తల్లిదండ్రులకు మధ్య తీవ్రవాగ్వాదం చెలరేగింది. ఫిబ్రవరి 1న రాత్రి 7.50 గంటల ప్రాంతంలో యువతి, కుటుంబసభ్యులను ఇంట్లోనే పెట్టి తాళం వేసి బయటకు వెళ్లిపోయింది.
అయితే తమ కూతురును అంకిత్ కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ అతడిపై కర్రతో దాడికి దిగాడు యువతి తండ్రి, బంధువులు. దీంతో భయాందోళనకు గురైన అంకిత్ తన స్నేహితులకు ఫోన్ చేసి, తన తల్లి దగ్గరికి వెళ్లమని, తన ప్రియురాలు వస్తే తనకు చెప్పమని చెప్పాడు. అంతేకాకుండా తాను ప్రమాదంలో ఉన్నట్టు స్నేహితులకు వివరించాడు. ఓ వీధిలో నిల్చొని స్నేహితులకు ఫోన్ చేస్తున్న దృశ్యాలు.. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఫిబ్రవరి 1న రాత్రి అంకిత్ మరణించడానికి కొద్ది సమయం ముందు భయంతో అటూ ఇటూ నడుస్తూ.. అతని స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఇది జరిగిన ఏడు నిమిషాల తర్వాత యువతి తండ్రి అంకిత్ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. 23 ఏళ్ల యువకుడి దారుణ హత్యను తీవ్రంగా ఖండించారు. సీనియర్ లాయర్లను పెట్టించి ఈ కేసులో యువకుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కేసులో యువతి తల్లి, తండ్రి, మైనర్ సోదరుడు, ఓ బంధువును పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు కూడా ప్రాణహాని ఉందని యువతి ఫిర్యాదు చేయడంతో నారీనికేతన్‌కు పంపించారు. బాధిత కుటుంబానికి కూడా పోలీసులు రక్షణ కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment