ఈ యువకుడి జీవితం అన్మోల్‌ | Anmol Juneja leaves gift of life for 34 | Sakshi
Sakshi News home page

ఈ యువకుడి జీవితం అన్మోల్‌

Published Tue, Sep 13 2016 10:26 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

ఈ యువకుడి జీవితం అన్మోల్‌ - Sakshi

ఈ యువకుడి జీవితం అన్మోల్‌

అన్మోల్‌ అంటే.. వెలకట్టలేనిదని అర్థం. అన్మోల్‌ అనే పేరు పెట్టుకున్నందుకేనేమో... ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి జీవితం కూడా వెలకట్టలేనంత విలువైనదిగా మారిపోయింది. తాను మరణిస్తూ 34 మందికి జీవం పోసిన ఈ ప్రాణదాత జీవితానికి వెలకట్టడం సాధ్యమేనా? ఇంతకీ అన్మోల్‌ ఎవరు? 34 మందికి ప్రాణం పోయడమేంటి? తెలుసుకోవాలనుంది కదూ.. అయితే చదవండి..

మనకోసం మాత్రమే మనం బతికితే ఆ బతుకు మరణంతో సమానం. అదే ఇతరుల కోసం చనిపోయినా..అది అమరంతో సమానం.
అంటే ఇతరుల కోసం  చనిపోయినా.. ఆ వ్యక్తి బతికున్నవారిలో ఎప్పటికీ సజీవంగా ఉంటాడని అర్థం... ఇవి ఎవరో చెబుతున్న మాటలు కావు, వేదాలు, ఉపనిషత్తుల్లో లిఖించిన సత్యాలు. తాము బతుకుతూ ఎంతో మందిని బతికిస్తున్న గోప్పవాళ్లు ఎందరో ఉన్నారు. కానీ.. తాను చనిపోతూ 34 మందికి ప్రాణం పోసిన అన్మోల్‌ గురించి విన్నారా..

ఢిల్లీకి చెందిన అన్మోల్‌ జునేజా జీవితం 20 ఏళ్లకే విషాదాంతమైంది. యాక్సిడెంట్‌ రూపంలో మృత్యువు అతణ్ని కబళించింది. అన్మోల్‌ కలలు, ఆశలు ఆవిరయ్యాయి. అన్మోల్‌ ఈ లోకంలో లేకున్నా అతని తండ్రి తీసుకున్న నిర్ణయంతో 34 మందిలో జీవిస్తున్నాడు. 2012 డిసెంబర్‌లో ఇంటికి వెళ్తూ తండ్రితో మాట్లాడిన కొన్ని నిమిషాలకే అన్మోల్‌కు యాక్సిడెంట్‌ జరిగింది. మధు విహార్‌ ఫ్లై ఓవర్‌ దగ్గర ట్రక్‌ అతణ్ని ఢొకొట్టింది. ఈ ప్రమాదంలో అన్మోల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజుల తర్వాత వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారించారు. ఎదిగిన కొడుకు ఇకలేడన్న దుఃఖంలోనూ అన్మోల్‌ తండ్రి మదన్‌ మోహన్‌ జునేజా కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అన్మోల్‌ అవయాలను దానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలని, తద్వారా తనకొడుకును వారిలో చూసుకోవాలని భావించాడు. అన్మోల్‌ బ్రెయిన్‌ మినహా ఇతర అవయవాలను దానం చేయవచ్చని వైద్యులు సూచించగా, మదన్‌ అంగీకరించాడు.

అన్మోల్‌ కళ్లను(రెటీనా, కార్నియా వంటివి) నలుగురికి దానం చేశారు. అతని కాలేయాన్ని పూర్తిగా మరో వ్యక్తి అమర్చారు. ఎయిమ్స్‌ వైద్య చరిత్రలో లివర్‌ను పూర్తిగా మరో వ్యక్తి అమర్చడం ఇదే తొలిసారిని అని వైద్యులు చెప్పారు. కిడ్నీలను, ఇతర కీలక అవయవాలను మరికొంతమందికి దానం చేశారు. ఇలా మొత్తం 34 మందికి అన్మోల్‌ అవయాలను అమర్చి వారికి కొత్తజీవితాలను ప్రసాదించారు. అన్మోల్‌ లివర్‌ అమర్చడం వల్ల ఓ మహిళా ఎస్‌ఐకి ప్రాణాం పోశారు. కోలుకున్న తర్వాత ఆమె కలిసినపుడు తాను ఉద్వేగానికి లోనయ్యానని అన్మోల్‌ తండ్రి చెప్పాడు. ఎంతోమందికి ప్రాణదానం చేసిన, చూపునిచ్చిన తన కొడుకును వారిలో చూసుకున్నానని, వారందరిని చూసినప్పుడు తనకు అన్మోల్‌ మాత్రమే కనిపించాడని, ముఖ్యంగా చూపు పొందినవారిని గమనించినప్పుడు వారి కళ్లు తాజ్‌మహల్‌ కంటే ప్రకాశవంతంగా కనిపించాయన్నాడు. అన్మోల్, అతని తండ్రి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని ఎంతోమంది స్వయంగా, సోషల్‌ మీడియా ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement