అన్నా హజారేను హతమారుస్తాం
పుణె: ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నాహజారేను హతమారుస్తానంటూ ఓ వ్యక్తి ఆయన కార్యాలయానికి బెదిరింపు లేఖ పంపారు. మరాఠీలో చేతిరాతతో రాసి ఉన్న లేఖలో హజారే సమాజంలో అశాంతికి కారణమవుతున్నారని, అందుకే అంతమొందిస్తామని ఉందని ఆయన కార్యాలయ ప్రతినిధి శ్యామ్ అశ్వా తెలిపారు.
లేఖలో రాసిన వ్యక్తి తనను నెవెసాకు చెందిన అంబాదాస్ గా పేర్కొన్నాడు. హజారేకు బెదిరింపు లేఖపై సమాచారాన్ని గురించి ఆయన కార్యాలయాన్ని కోరగా వారు నిరాకరించారని పార్నర్ పోలీసులు తెలిపారు. 33 నెలల్లో ఇది 15వ బెదిరింపు లేఖ. కానీ ఈసారి ఆయనను జనవరి 26న హతమారుస్తామని లేఖలో పేర్కొన్నారు. గాంధేయవాది ఇటువంటి బెదిరింపులకు భయపడరని హజారే వ్యక్తిగత కార్యదర్శి అసవ తెలిపారు. హజారేకు జెడ్ కేటగిరీ రక్షణ ఉంది.