న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ చర్యలపై మండిపడ్డారు. మిగితా పార్టీలకు ఆప్‌కు పెద్ద తేడా ఏముందని ధ్వజమెత్తారు. ఆప్ అధికారిక వెబ్ సైట్లో నుంచి పార్టీకి విరాళం ఇచ్చిన వారి పేర్లను తొలగించడంపై కేజ్రీవాల్‌ను హజారే ఎండగట్టారు. వారి పేర్లను ఎందుకు తొలగించాల్సి వచ్చిందని, మిగితా పార్టీలకు ఆప్‌కు తేడా ఏముందని ఆయన ప్రశ్నించారు.
మార్పు తీసుకొస్తానంటూ ఇచ్చిన ఏ ఒక్క హామీని కేజ్రీవాల్ నెరవేర్చలేకపోయారని అన్నారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాశారు. 'పార్టీకి విరాళం ఇచ్చిన వారి వివరాలను పార్టీ వెబ్‌సైట్లో ఉంచుతానని హామీ ఇచ్చావు. కానీ 2016 జూన్ నుంచి వారి వివరాలను పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించారని నాకు లేఖ వచ్చింది. సమాజంలో మార్పు తీసుకొస్తానని నాకు హామీ ఇచ్చావు. కానీ, నువ్వు వాటిని నెరవేర్చలేదు. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను' అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.