
కేజ్రీవాల్ కు హజారే ఝలక్
రాలెగావ్ సిద్ధి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే అన్నారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మంత్రులపై చర్యలు తీసుకోకపోతే నిరసనకు దిగుతానని ఆయన హెచ్చరించారు. తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో హజరే విలేకరులతో మాట్లాడుతూ... కేజ్రీవాల్ ప్రవర్తనపై తనకు ఎటువంటి అనుమానాలు లేవన్నారు.
ఆప్ అధికారంలోకి వచ్చాక కేజ్రీవాల్ ప్రతిష్ట దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చుట్టూవున్న నాయకుల కారణంగా అప్రదిష్టపాలయ్యారని అన్నారు. మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులకు ‘ఆప్’లో స్థానం కల్పించివుంటే కేజ్రీవాల్ కు సమస్యలు వచ్చేవి కాదని అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ మళ్లీ ప్రజల విశ్వాసం పొందాలంటే అధికారం వదులుకుని, దేశ సేవకు మరోసారి ముందుకు రావాలని సూచించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం రాజకీయ నాయకులు మహిళలను పావులుగా వాడుకుంటున్నారని వస్తున్న వార్తలు దురదృష్టకరమని హజారే వ్యాఖ్యానించారు.