మమతకు మద్దతుపై హజారే వెనక్కి
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు మద్దతు విషయంలో సామాజిక కార్యకర్త అన్నాహజారే వెనక్కి తగ్గారు. ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం ఇంతకుముందు మమతకు మద్దతు పలికిన ఆయన రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు మద్దతిచ్చేది లేదని తాజాగా స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ‘సంయుక్త ర్యాలీ’కి హాజరవకుండా మమతాబెనర్జీని ఇరకాటంలో పడేసిన హజారే శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. తనను మోసగించిన కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం బెంగాల్ సీఎం చుట్టూ చేరి ఉన్నారని, అందువల్ల ఆమెకు మద్దతివ్వడం తనకు కష్టసాధ్యంగా మారిందని చెప్పారు.
ర్యాలీ విఫలమైన తరువాత కూడా ప్రధాని పదవికి మమతకే మద్దతిస్తారా? అని ప్రశ్నించగా... ఆయన పైవిధంగా స్పందించారు. రాబోయే ఎన్నికలకోసం తృణమూల్ రూపొందించిన ప్రచార ప్రకటనలో తన పేరును ఉపయోగించుకోవద్దని సూచించినట్టు చెప్పారు.