శశికళ జరిమానా కట్టకపోతే..
మరో 13 నెలల జైలు శిక్ష
⇒ జైళ్ల సూపరింటెండెంట్ ప్రకటన
⇒ చిన్నమ్మ దర్శనానికి అనుమతి నో
బొమ్మనహళ్లి/ బెంగళూరు/ సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్షకుగురైన అన్నాడీఎంకే నాయకురాలు శశికళ సుప్రీంకోర్టు తనకు విధించిన రూ.10 కోట్ల జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో 13 నెలలు జైల్లోనే గడపాల్సి ఉంటుంది. జైళ్ల శాఖ సూపరింటెండెంట్ కృష్ణకుమార్ మంగళ వారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శశికళ కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈమెకు దిగువ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2014 సెప్టెంబర్‌లో దిగువ కోర్టు శిక్ష విధించిన తర్వాత 21 రోజుల పాటు ఇదే జైల్లో ఉన్నా రు. ఈ నేపథ్యం లో మామూలుగానే దాదాపు మూడేళ్ల 11 నెలలు శిక్ష అనుభవించాల్సి ఉంది.
శశికళతోపాటు ఇళవరసి, సుధాకరన్‌లకు జైల్లో ఎలాంటి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించడం లేదని కృష్ణకుమార్ పేర్కొన్నారు. అందరితో పాటు టీవీ చూసేందుకు అనుమతిస్తున్నా మని తెలిపారు. ఇలావుండగా శశికళను కలవడానికి తమిళనాడు మంత్రులు, ప్రముఖ నాయకులు జైలుకు వచ్చారు. అయితే అధికారులు వారిని ములాఖత్‌కు అనుమతించలేదు. మంత్రులు సెంగో ట్టియన్, దిండిగల్ శ్రీనివాసన్, సెల్లూరు రాజు తమ అనుచరులతో తరలివచ్చారు. వీరితో పాటు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సరస్వతి, మాజీ మంత్రి గోకులేంద్ర, మరికొంతమందికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. మరోవైపు స్పీకర్ పి.ధనపాల్‌పై అవిశ్వాస తీర్మానం కోరుతూ విపక్ష డీఎంకే అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌కు లేఖ అందజేసింది. ఈ నెల 18న పళనిస్వామి ప్రభుత్వ విశ్వాస పరీక్ష సందర్భంగా స్పీకర్ అనుసరించిన వైఖరి నేపథ్యంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్టాలిన్ తెలిపారు.