సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లద్ సింగ్ పటేల్‌ను బుధవారం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, వైఎస్సార్‌సీసీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధిపై చర్చించారు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రం స్వదేశీ దర్శన్ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కోరామన్నారు. గతం ప్రభుత్వం పట్టించుకోని కారణంగా రాష్ట్రానికి ఈ పథకం ద్వారా నిధులు రాలేదని, కేంద్రానికి స్వదేశి దర్శన్ కింద 900 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు.
దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలో అమరావతి లేదా విశాఖపట్నంలో పర్యాటక రంగంలో పెట్టుబడులపై సదస్సు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కేంద్రం పర్యాటక మంత్రి సమయాన్ని బట్టి తేదీలను ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఆ తేదీలకు అనుగుణంగానే పర్యాటక సదస్సును నిర్వహిస్తామన్నారు. ఈ నెల 25న జరిగే పర్యాటక శాఖ మంత్రుల సమావేశంలో తేదీలు ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విజయవాడలో చంద్రబాబు ప్రభుత్వం దేవాలయాలను కూల్చి ఘోర తప్పిదం చేసిందని, ఆ 24 దేవాలయాలను తిరిగి పున ప్రతిష్ట చేస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాల కోసం ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయాలని కోరినట్లు, దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పును తమ ప్రభుత్వం సరిచేస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment