సాక్షి, విశాఖపట్నం: ఒకేసారి 16 వేల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలీ నియోజకవర్గంలో మధురవాడలో నవరత్నాలు పేదలందరికి ఇళ్లు కార్యక్రమాన్ని మంత్రి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయిరెడ్డి, మంత్రి శ్రీరంగనాథ్ రాజు, ఎంపీ ఎంవీవీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణలు పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 31 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్లను కాకుండా ఊళ్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
అర్హతే ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని, పార్టీలకు అతీతంగా ఇళ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కళ్లున్న కబోదని, సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందని ఇళ్ల పట్టాల్లో అవినీతి జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో జిల్లాలో ఎక్కడైన అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్దమని, చంద్రబాబు కోర్టులకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని అవంతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment