
ఆమ్ ఆద్మీ ‘పవర్’
విద్యుత్ చార్జీలపై 50 శాతం సబ్సిడీ
ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ సర్కార్ కానుక
సాక్షి, న్యూఢిల్లీ: అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విధుల్లో నిమగ్నమయ్యారు. ఉచిత మంచినీటి సరఫరా విషయంలో ఎన్నికల హామీని నెరవేర్చుకున్న ఆప్ సర్కారు.. తమ మరో ప్రధాన హామీ అయిన విద్యుత్ చార్జీల తగ్గింపుపై మంగళవారం నిర్ణయం తీసుకుంది. మంత్రిమండలి సమావేశం అనంతరం 400 యూనిట్లలోపు విద్యుత్ వినియోగంపై విద్యుత్ చార్జీల్లో 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. 28 లక్షల వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయం వల్ల వచ్చే 3 నెలల్లో దాదాపు రూ. 61 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. అలాగే, ఢిల్లీలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు.. బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్, బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, ఎన్‌డీపీఎల్ కంపెనీల ఖాతాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సీఏజీ)తో తనిఖీ చేయించాలని నిర్ణయించారు.
ఆడిట్ ఎందుకు చేయించకూడదనే విషయాన్ని బుధవారం ఉదయంలోగా తెలియజేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం ఆ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. ఆడిట్ పూర్తయిన తరువాత భవిష్యత్తులో మరోమారు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. విద్యుత్ చార్జీల తగ్గింపు నిర్ణయం నేటి నుంచి అమలులోకి వస్తుందన్నారు. 0-200 యూనిట్ల వరకు డీఈఆర్‌సీ యూనిట్ టారిఫ్ రూ.3.90 ఉండగా తాజాగా యూనిట్‌కి రూ.1.95గా, 201-400 యూనిట్ల వరకు డీఈఆర్‌సీ యూనిట్ టారిఫ్ రూ.5.80 ఉండగా ఢిల్లీ ప్రభుత్వం రూ.2.90గా ప్రకటించింది. విద్యుత్ వినియోగం 400 యూనిట్లు దాటితే ఎలాంటి సబ్సిడీ వర్తించదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. మరో 48 గంటల సమయం మాత్రమే ఉందనుకుని పనిచేస్తున్నానని ఈ సందర్భంగా కేజ్రీవాల్ విలేకరులతో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కొనసాగుతుందా? లేదా? అనే దానితో సంబంధంలేకుండా ఆ కొద్ది సమయంలోనే ప్రజలకు సాధ్యమైనంత మంచి చేయాలనుకుంటున్నానన్నారు.
జనవరి 2న ఆయన ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోబోతున్న నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రభుత్వాన్ని కూల్చివే యాలనే యోచనలో ఉన్నాయని ఆరోపించారు. ‘కాంగ్రెస్, బీజేపీలను నమ్మలేం. ప్రభుత్వం నిలబడుతుందా, లేదా అన్నదాన్ని కూడా పట్టించుకోం. ఇంకో 48 గంటల సమయం మాత్రమే ఉందనుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం’ అన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా తమ పార్టీ నుంచి ఎమ్‌ఎస్ ధిర్‌ను ప్రతిపాదిస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. బుధవారం నుంచి జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో తాత్కాలిక స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు బీజేపీ సీనియర్ నేత జగ్‌దీశ్ ముఖి తిరస్కరించడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మతీన్ అహ్మద్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారని కేజ్రీవాల్ వెల్లడించారు. జ్వరం, విరోచనాలతో కేజ్రీవాల్ బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి మంగళవారం కొంతమేర మెరుగుపడింది.
మద్దతుపై మరోమాట లేదు
తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఆ రెండు పార్టీలు తోసిపుచ్చాయి. ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామనే మాటకు కట్టుబడి ఉన్నామని, తమ ఎమ్మెల్యేలు విశ్వాసపరీక్ష సమయంలో ఆప్‌కు ఓటు వేస్తారని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జి షకీల్ అహ్మద్ చెప్పారు. అసలు ఆప్‌కు ప్రభుత్వం నడపాలనే ఉద్దేశమే లేదని బీజేపీ ఆరోపించింది.