కేంద్రంపై శివసేన ఫైర్
Published Wed, Sep 20 2017 3:29 PM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM
సాక్షి, ముంబయి : కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ మిత్రపక్షం శివసేన మరోసారి మండిపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్ ధరలు పెంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. బుల్లెట్ రైలుకు తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లించేందుకే ఇంధన ధరలను పెంచుతున్నారా అని కేంద్రాన్నినిలదీసింది. గత నాలుగు నెలల్లో 20 సార్లు పెట్రో ధరలను పెంచడాన్ని ప్రభుత్వంలో ఉన్న వారు సమర్ధిస్తే అది సరైంది కాదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం స్పష్టం చేసింది.
గత ఏడాదిలో వంట గ్యాస్ ధరలు 15 సార్లు పెరిగాయని పేర్కొంది. కాంగ్రెస్ హయాంలో వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ 320 రూపాయలు దాటలేదని, ప్రస్తుతం సిలిండర్ ధర రూ 785కు చేరిందని తెలిపింది. ప్రధాని ప్రజలకు బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలనుకుంటున్నారని, అయితే ప్రజలు ఇప్పుడు వారి స్కూటర్లు, కార్లలో రెండు లీటర్ల పెట్రోల్ పోయించుకోలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొంది. ఓ వైపు సంపన్నులు బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించనుంటే..మరోవైపు వాహనాలను భరించలేని సామాన్యులు ఎద్దుల బండిలో ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది.
Advertisement
Advertisement