ఢిల్లీలో కెప్టెన్ కపిల్ మృతదేహం వద్ద రోదిస్తున్న ఆయన సోదరి
న్యూఢిల్లీ/చండీగఢ్: పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఆదివారం నాటి పాక్ కాల్పుల్లో నలుగురు సైనికులు చనిపోయినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆర్మీ సోమవారం స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ మాట్లాడుతూ ‘పాక్ కాల్పులకు సైన్యం తగిన రీతిన సమాధానమిస్తూ వస్తోంది. ఇది ఇకపై కూడా కొనసాగుతుంది. అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసి చూపిస్తాం’ అని అన్నారు. పాక్ కాల్పుల్లో కెప్టెన్ కపిల్ కుందు (22)తోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించడం తెలిసిందే. పాక్ మూర్ఖపు చర్యకు భారత్ తిరిగి సమాధానమిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ కూడా అన్నారు.
సాహసాలంటే ఇష్టం: పాక్ కాల్పుల్లో ఆదివారం అమరుడైన కెప్టెన్ కపిల్ కుందు (22) భౌతిక కాయానికి ఢిల్లీలోని పాలం వైమానిక స్థావరంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నివాళులర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని కుందు స్వగ్రామమైన గుర్గావ్ సమీపంలోని పటౌడీకి తరలించారు. కుందు మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఫిబ్రవరి 10న పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వస్తానని కుందు తమకు చెప్పాడనీ, ఇంతలోనే ఘోరం జరిగిందని ఆయన తల్లి సునీత, సోదరిలు విలపిస్తున్నారు. కుందు స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి భారత దళాలు ప్రతీకారం తీర్చుకోవాలంటూ స్థానికులు నినాదాలు చేశారు. కుందుకు సాహసాలతో కూడిన జీవితమంటే ఇష్టమనీ, అందుకే ఆర్మీలో చేరాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తనకు మరో కొడుకు ఉంటే అతణ్నీ ఆర్మీకి పంపి ఉండేదాన్ననీ, కుందు సైన్యంలో చేరిన తర్వాత చాలా సంతోషంగా ఉండేవాడని సునీత చెప్పారు. తన కొడుకు ఎప్పుడూ దేశం కోసమే బతికాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment