శ్రీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును ఎగతాళి చేయబోయిన జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ నేతలు ధీటైన సమాధానాలిచ్చారు. కరోనా వ్యతిరేక పోరాటానికి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు దీపాలు లేదా క్యాండిల్స్ వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కుల, మత తేడాలు లేకుండా అన్ని వర్గాల వారు దీపాలు వెలిగించి తమ ఐక్యతను చాటిచెప్పారు. దీనిపై ఒమర్ అబ్దుల్లా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. "ఢిల్లీలో టపాసులు కాల్చుతున్నారు. ఇప్పుడేం వేడుక జరుగుతోందని!" "ఇంతకీ కరోనా వెళ్లిపోయినట్టేనా మరి?" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బీజేపీ నేతలు అతనికి కౌంటర్లివ్వడం ప్రారంభించారు. (‘ఒమర్..బాదం తిని మెమరీ పెంచుకో’)
"అవును, ఆర్టికల్ 370, 35ఏ రద్దయి సరిగ్గా ఎనిమిది నెలలు అవుతున్నందున పండగ చేసుకుంటున్నాం.. అయితే ఆసుపత్రిలో ఉంటున్న తగ్లిబి జమాత్ సభ్యులు నర్సులతో అనుచితంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. మీరేమైనా వారికి కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే.. అప్పుడు భారత్‌లో తప్పకుండా కరోనా నియంత్రణలోకి వస్తుంద"ని సురేంద్ర పూనియా అనే బీజేపీ నాయకుడు సలహా ఇచ్చారు. ఏదైతేనేం, మరోసారి ఈ ఆర్టికల్ అంశం ట్రెండింగ్‌లో నిలిచిందని ఒమర్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా గతేడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ సమయంలో ఎలాంటి ఆందోళనలు చెలరేగకుండా ఉండేందుకు పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను గృహ నిర్బంధం చేసింది. ఈ క్రమంలో ఏడు నెలల తర్వాత మార్చి 24న ఒమర్ అబ్దుల్లా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. (ఏడు నెలల నిర్బంధం.. ఎట్టకేలకు విముక్తి)
Comments
Please login to add a commentAdd a comment