
న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. యాత్రికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముమ్రు అధ్యక్షతన మంగళవారం జరిగిన అమర్నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు 39 వ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమర్నాథ్ యాత్ర-2020 పై కరోనా ప్రభావం అంశం మీద ఈ వర్చువల్ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే పెరిగిపోతున్న కేసులకు తోడు యాత్రికులు కూడా కోవిడ్ బారినపడితే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు.
కాగా, అమర్నాథ్ యాత్ర నిర్వహించకుండా అడ్డుకోవాలని సుప్రీం కోర్టులో జులై 13 వ్యాజ్యం దాఖలైంది. అయితే, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసి జమ్మూకశ్మీర్ యంత్రాంగమే యాత్ర నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో అమర్నాథ్ దేవాలయ బోర్డు తాజా నిర్ణయం తీసుకుంది. ఇక మంచు రూపంలో ఉన్న శివునికి నిత్య కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయని బోర్డు సభ్యులు తెలిపారు. ఉదయం, సాయంత్రం జరిగే హారతి కార్యక్రమాలు టెలీకాస్ట్ చేస్తామని తెలిపారు.
(కోవిడ్‌కు అత్యంత చవకైన ట్యాబ్లెట్ ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment