మోదీపై ప్రచారం వెనుక జైట్లీ? | arun jaitley behind negative campaigh against narendra modi, says kiswar | Sakshi
Sakshi News home page

మోదీపై ప్రచారం వెనుక జైట్లీ?

Published Wed, Nov 4 2015 3:55 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీపై ప్రచారం వెనుక జైట్లీ? - Sakshi

మోదీపై ప్రచారం వెనుక జైట్లీ?

దేశంలో 'అసహనం' పెరిగిపోతోందని, ఇది ప్రమాదకర పరిణామమని రచయితలు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, సినిమా నటులే కాకుండా చివరకు పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రధాన బాధ్యుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ప్రతిపక్షమే కాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ అవార్డు గ్రహీతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశానికి మీడియా కూడా విస్తృత ప్రచారాన్ని కల్పిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా 'నమో మోదీ' అంటూ మీడియా ఆయనకు అనుకూల ప్రచారాన్ని కొంత ఎక్కువే చేసింది.

మరి ఎందుకు హఠాత్తుగా సీన్ రివర్స్ అయింది? నాడు మోదీని పొగిడిన రాతలే ఇప్పుడు దేశంలో అరాచకం, అసహనం పెరగడానికి మోదీయే కారణమని విమర్శస్తున్నాయనే అనుమానం సామాన్య పాఠకులకు కలుగుతోంది. మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కారణమా? మోదీ వ్యతిరేక ప్రచారోద్యమం సామాజిక మాధ్యమాల్లో ఊపందుకోవడానికి వామపక్ష, లౌకికవాద శక్తుల చైతన్యమే కారణమా? దీనివెనక అదృశ్య శక్తులేవైనా ఉన్నాయా?

ఈ వ్యవహారంలో, మీడియా ప్రచారోద్యమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హస్తం ఉందని ప్రముఖ భారతీయ విద్యావేత్త, రచయిత, జర్నలిస్ట్, ఢిల్లీలోని 'సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్' సీనియర్ ఫెలో మధు పూర్ణిమా కిశ్వర్ ఆరోపిస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా జైట్లీయే మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఆమె ట్విట్టర్‌లో పలు ట్వీట్లు చేశారు. గతంలో 'మోదీనామా' పేరిట రాసిన పలు వ్యాసాల్లో మోదీని తెగపొగిడిన కిశ్వర్ ఇప్పుడు ట్వీట్లలో మోదీని కూడా విమర్శించారు. 'దాద్రి' లాంటి ఘటనలు మోదీకి మాయని మచ్చేనని వ్యాఖ్యానించారు. 2002 నుంచి మోదీ 'అసహనం'కు బాధితుడవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మోదీకి వ్యతిరేకంగా ప్రచారోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేది అరుణ్ జైట్లీయేనని కిశ్వర్ ఆరోపించడం వెనక అంతరార్థం ఏమిటి? మోదీని అప్రతిష్టపాలు చేయడానికి జైట్లీ ఎందుకు వ్యూహం పన్నుతారు? ఆయనకు వచ్చే లాభం ఏమిటి? మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రధాని హోదాకు ఎదగాలనే తాపత్రయమా ? ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement