ఇక ఇవ్వాల్సింది రూ.138 కోట్లే
- రెవెన్యూ లోటు భర్తీపై అరుణ్ జైట్లీ స్పష్టీకరణ
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు భర్తీ కింద ఇకపై వచ్చేది రూ.138.39 కోట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు మొత్తాన్ని రూ.16,078 కోట్ల నుంచి రూ.4,117.89 కోట్లకు కుదించేసింది. అందులో ఇప్పటివరకు రూ.3,979.50 కోట్లు ఇచ్చేసినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఇవ్వాల్సిన మొత్తాన్ని కొద్దికాలంలో విడుదల చేస్తామని తెలిపారు.
‘ప్యాకేజీకి’ అంగీకరించి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వదులుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన చట్టంలోని హామీల సాధన లోనూ విఫలం కావడంతో రాష్ట్రం భారీగా నష్టపోతోంది. పదవ షెడ్యూల్‌లో గల సంస్థల ఆస్తులు ‘ఎక్కడివి అక్కడే..’ అని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే తొమ్మిదవ షెడ్యూల్లో గల సంస్థల ఆస్తులంటే ప్రధాన కేంద్ర కార్యాలయాల ఆస్తులే తప్ప, మిగతా యూనిట్లు, ఉప కార్యాలయాల ఆస్తుల పంపిణీ ఉండదని కూడా ఇటీవల తేల్చిచెప్పింది. అయినా చంద్రబాబు పట్టించుకోక పోవడంతో రాష్ట్రానికి మరో భారీ నష్టం జరిగింది.