టీవీ కవరేజి కోసమే గందరగోళం చేస్తున్నారు
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. ప్రతిపక్షం, అధికార పక్షాల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, ఆయా నేతలకు మద్దతుగా ఎంపీలు నినాదాలు చేయడంతో పార్లమెంటు ఉభయ సభలు సమావేశమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి.
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. ప్రతిపక్షం, అధికార పక్షాల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, ఆయా నేతలకు మద్దతుగా ఎంపీలు నినాదాలు చేయడంతో పార్లమెంటు ఉభయ సభలు సమావేశమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ''బ్యాంకుల్లో భారీగా నగదు జమ అయ్యిందంటున్నారు, మరి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది ఎందుకు, అసలు బ్యాంకులన్నింటిలో కలిపి ప్రతిరోజూ ఎంత మొత్తం జమ అయ్యిందో, ఎంత ఇస్తున్నారో అనే వివరాలు రహస్యంగా ఎందుకు ఉచుతున్నారు, వాటిని సభ ముందు ఉంచాలి'' అని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. 30 రోజులవుతున్నా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని మాయావతి అన్నారు
అయితే.. అసలు ఈ అంశంపై ప్రతిపక్షం చర్చ కోరిన మరు నిమిషమే తాము అంగీకరించామని, కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ చర్చను ప్రారంభించారని, ఇప్పటికి ఒకటిన్నర రోజులు దానిపై చర్చ జరిగిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. విషయం చాలా ముఖ్యమైనది కాబట్టి చర్చ పూర్తికావాలని, ఆజాద్ ప్రస్తావించిన అంశాలన్నీ చర్చలో భాగమేని ఆయన చెప్పారు. ప్రతిరోజూ ఏదో ఒక వంకతో చర్చను ఆపేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని, కేవలం టీవీ కవరేజిల కోసమే ప్రతిపక్ష సభ్యులు గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ విషయం మీద చర్చజరగాలో దాన్ని మాత్రం జరపడం లేదన్నారు. ప్రతిపక్షానికి ధైర్యం ఉంటే నోట్ల రద్దుపై చర్చను కొనసాగనివ్వాలని జైట్లీ అనడంతో ఒక్కసారిగా ప్రతిపక్ష సభ్యులు లేచి నినాదాలు మొదలుపెట్టారు.
వాళ్లకు వ్యతిరేకంగా అధికార పక్ష సభ్యులు కూడా నినాదాలు చేయడంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఇరుపక్షాలపై మండిపడ్డారు. చివరకు సభను 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురుకావడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా సభను 12 గంటలకు వాయిదా వేశారు.