కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌పై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. అలాంటి అవకాశవాద కూటములు దేశం కోసం కాకుండా మనుగడ కోసమే పనిచేస్తాయని విమర్శించారు. దేశానికి నరేంద్ర మోదీ లాంటి నేత అవసరం ఉందని, కర్ణాటక సీఎం కుమారస్వామి వంటి ట్రాజెడీ కింగ్‌లతో పనిలేదని ఎద్దేవా చేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం మింగడంతో సమానమంటూ ఆదివారం జరిగిన ఓ సభలో కుమారస్వామి భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే.
కర్ణాటకలో కాంగ్రెస్ ఏం చేసిందో గతంలో చౌదరి చరణ్ సింగ్, చంద్రశేఖర్, హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ల విషయంలోనూ ఇదే తీరుతో వ్యవహరించిందని జైట్లీ దుయ్యబట్టారు. మోదీని అధికారం నుంచి తప్పించడమే వీరి అవకాశవాద కలయిక అజెండా అని ఆరోపించారు.
సిద్ధాంతపర వైరుధ్యాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం దేశాన్ని ముందుకు నడపలేదని తేల్చిచెప్పారు. ఈ తరహా ప్రభుత్వాలు దేశ ప్రయోజనాలకు విఘాతమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సంకీర్ణ సర్కార్‌కు సారథ్యం వహించే ప్రధాని కెమెరాల ఎదుట కంటనీరు ఒలికిస్తే అది యూపీఏ 2 కన్నా ఘోరంగా ఉంటుందని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment