kumaraswami
-
‘‘2 సీట్ల కోసం పొత్తా..? సొంతగానే గెలుస్తాం’’
బెంగళూరు: బీజేపీని తాము నమ్ముతామని, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు లేదా నాలుగు సీట్లు ఆ పార్టీ ఇస్తుందన్న నమ్మకం ఉందని జేడీఎస్ అధినేత కుమారస్వామి అన్నారు. బీజేపీతో పొత్తు విషయమై మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘పొత్తులో భాగంగా మేం ఆరు, ఏడు సీట్లు అడగడం లేదు. మూడులేదా నాలుగు సీట్లు మాత్రమే అడుగుతున్నాం. మా బలమేంటో బీజేపీకి తెలుసు. మాకు బీజేపీపై నమ్మకం ఉంది. రెండు సీట్ల కోసం నేను పొత్తు పెట్టుకోవాలా’ అని కుమారస్వామి ప్రశ్నించారు. పొత్తు లేకుండా పోటీ చేసినా మాండ్యా, హసన్ నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. మాండ్యా, హసన్, కోలార్ ఎంపీ సీట్లు తమకు ఇవ్వాల్సిందిగా బీజేపీని అడిగినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే బీజేపీ కర్ణాటకలో ఉన్న 28 సీట్లకు గాను 26 మంది అభ్యర్థులను మార్చ్ 13న రిలీజ్ చేసిన రెండో జాబితాలో ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి.. తమిళనాడులో బీజేపీ వ్యూ హం -
పెళ్లి వద్దనుకున్న ఫ్రీడమ్ ఫైటర్
కె. కామరాజ్‌గా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి కామరాజ్ స్వాతంత్య్రోద్యమ నాయకుడు. ‘భారతరత్న’ పురస్కార విజేత. నిరుపేద కల్లుగీత కుటుంబంలో పుట్టిన ఆయన ప్రజల కోసమే జీవితం అంకితం చేసి,పెళ్లి కూడా చేసుకోలేదు. కామరాజ్ మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. అనేక సందర్భాలలో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఎనిమిది సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు. భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న కామరాజ్, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అత్యంత సన్నిహితులు. నెహ్రూ మరణం తర్వాత 1964లో లాల్ బహదూర్ శాస్త్రిని, ఆయన తర్వాత 1966లో ఇందిరా గాంధీని ప్రధానులను చేయటంలో కామరాజ్ ప్రధానపాత్ర పోషించారు. కామరాజ్ అనుయాయులు అభిమానంగా ఆయన్ని దక్షిణ గాంధీ, నల్ల గాంధీ అని పిలిచేవారు. 1957లో కామరాజ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యను, పాఠశాలలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి అనేక లక్షలమంది గ్రామీణ పేదప్రజలకు విద్యావకాశం కల్పించారు. నేడు కామరాజ్ జయంతి. 1903 జూలై 15న ఆయన జన్మించారు. (చదవండి: విధి నిర్వహణలో నెహ్రూ నుంచి ప్రశంసలు అందుకున్న దుర్గాబాయ్) -
హిందీ రాకుంటే దేశం విడిచి వెళ్లిపోవాలా?
బెంగుళూరు : హిందీ భాషపై తమిళనాడులో తీవ్ర వివాదం చెలరేగుతూనే ఉంది. తమిళ వైద్యులకు హిందీ తెలియదని ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే వ్యవహరించిన తీరు తమిళనాట ఆగ్రహాన్ని రేపింది. హిందీ రాకుంటే శిక్షణా కార్యక్రమం నుంచి బయటకు వెళ్లాలంటూ వ్యాఖ్యలు చేసిన రాజేష్ కొట్చేపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ రానంత మాత్రానా ఇతర భాషల వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలా అంటూ ఫైర్ అయ్యారు. దేశ ఐక్యత సమాఖ్యవాదంపై ఆధారపడి ఉంటుందని, భారత్‌లో అన్ని భాషలు సమానమేనని అన్నారు. హిందీ అర్థం కాకుంటే వెళ్లిపోండి అనడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మాట్లాడిన ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కుమారస్వామి డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. (ఇది హిందీ ప్రభుత్వం కాదు: కమల్) వివరాల్లోకి వెళ్తె, సెంటర్ ఫర్ డాక్టర్స్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయుష్ యూనియన్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా స్పందిస్తూ.. తాను ఇంగ్లీషులో మాట్లాడనని, తాను హిందీలోనే మాట్లాడతానని, హిందీ అర్థం కాని వారు సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. కాగా ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన 37 మంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ ట్రైనర్స్ కోసం ఆయుష్ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చాలా సెషన్లు హిందీలో జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. తమిళ డాక్టర్లను అవమానించేలా ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే వ్యవహరించిన తీరు పట్ల తమిళ పార్టీలు, సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. (హిందీ దుమారం) -
‘20 రోజులు లాక్డౌన్ విధించాలి’
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. వైరస్ కట్టడి కోసం యడ్యూరప్ప సర్కారు మరోసారి లాక్డౌన్ ప్రకటించింది. సోమవారం బెంగళూరులోని ఐదు ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. అయితే కర్ణాటక సర్కారు తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేవలం ఐదు ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తే ప్రయోజనం ఉండదని.. బెంగళూరు మొత్తం 20 రోజుల పాటు లాక్డౌన్ విధించాలి అని ఆయన ప్రభుత్వాన్నికోరారు. లాక్డౌన్ అమలులో కఠినంగా వ్యవహరించకపోతే.. బెంగళూరు మరో బ్రెజిల్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల జీవితాలు చాలా ముఖ్యమైనవి అని కుమారస్వామి వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుత సమయంలో కార్మికులకు నిత్యావసర సరుకులతోపాటు, రూ.5వేల ఇవ్వాలని కుమారస్వామి కర్ణాటక సర్కారును విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వారికి ఏమాత్రం సరిపోదన్నారు. కార్మికులకు అవసరమైన సాయాన్ని వెంటనే అందించాలని కుమారస్వామి కోరారు. -
ప్రశాంత్ కిశోర్‌కి యమ క్రేజ్!
సాక్షి, బెంగళూరు: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నో రాజకీయ పార్టీలు అధికారలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెల్సిందే. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ తిరిగి గెలుపొందడంతో ప్రశాంత్ కిషోర్‌కు డిమాండ్ పెరిగింది. ఆయనతో కలిసి పనిచేయడానికి పలు పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నాయకులు కుమారస్వామి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో పనిచేసే ఐప్యాక్ సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. చదవండి: సీఎం జగన్‌తో టాలీవుడ్ అగ్ర నిర్మాతల భేటీ అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌తో కుమారస్వామి మంగళవారం భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్తు కోసం ఏం చేయాలనే అంశాన్ని చర్చించారు. తొలి విడత చర్చలు జరిగాయని, మిగతా అంశాలను త్వరలో వెల్లడిస్తానని కుమారస్వామి తెలిపారు. కాగా.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లను గెలుపొందింది. కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి సీఎం అయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో. కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో విశ్వాస పరీక్షలో నెగ్గలేక ఆ ప్రభుత్వం పడిపోయింది. తరువాత మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తదనంతరం జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 28 సీట్లకు గానూ ఆ పార్టీ కేవలం ఒక్క చోట మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: గాంధీ వైపా? గాడ్సే వైపా? -
జేడీఎస్‌కు షాక్.. పోటీ విరమణ!
బెంగళూరు: ఉప ఎన్నికల సమరంలో ప్రతిపక్ష జేడీఎస్‌కు ఊహించని ఫలితాలు ఎదురవుతున్నాయి. హిరేకరూరు, అథణి అభ్యర్థులు పోటీ చేయరాదని నిర్ణయించారు. మరో నియోజకవర్గంలో అభ్యర్థి నామినేషన్ చెల్లలేదు. మండ్య కేఆర్‌పేటెలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారానికి ముఖం చాటేయడం గమనార్హం. 15కు గాను 14 స్థానాల్లో పోటీలోనున్న జేడీఎస్‌కు తాజా పరిణామాలు శరాఘాతమే. త్వరలో ఈ సంఖ్య పెరిగినా పెరగవచ్చని నాయకుల మాట. రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరిరోజు కాగా జేడీయస్‌కు పలువురు అభ్యర్థులు అనూహ్యంగా షాక్ ఇస్తున్నారు. హిరేకరూరు నియోజకవర్గం నుంచి జేడీయస్ అభ్యర్థి శివలింగ శివాచార్యస్వామీజీ నామినేషన్ వెనక్కి తీసుకోనున్నారు. అదేవిధంగా అథణి నియోజకవర్గం జేడీయస్ అభ్యర్థి, డిప్యూటీ సీఎం లక్ష్మణసవది ఆప్తుడు గురుదాస్కళ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. చిక్కబళ్లాపురం అభ్యర్థి కేపీ.బచ్చేగౌడ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు సక్రమంగా లేదని తిరస్కరించారు. అతనికి బదులు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అనితా కుమారస్వామి బంధువును ప్రకటించాలని జేడీయస్ భావిస్తోంది. కేఆర్ పేటెలో కినుక మండ్య జిల్లాలోని కేఆర్.పేటే నియోజకవర్గంలో దేవరాజుకు జేడీఎస్ టికెట్ కేటాయించడం ఎమ్మెల్యేలు పుట్టరాజు, డీసీ. తమ్మణ్ణ, అన్నదానికి నచ్చడం లేదు. దీంతో వారు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కేఆర్.పేటే ఉప ఎన్నికలో జేడీయస్ నుంచి జిల్లా పంచాయతీ సభ్యుడు హెచ్డీ.రాజు కు టికెట్ ఇవ్వాలని పుట్టరాజుతో పాటు పలువురు జేడీయస్ నేతలు దళపతులపై ఒత్తిడి తీసుకువచ్చినా పట్టించుకోలేదు. హ్యాండిచ్చిన స్వామీజీ హిరేకరూరు నియోజకవర్గం నుంచి జేడీయస్ అభ్యర్థి శివలింగాచార్యస్వామిజీ సీనియర్ మఠాధీశుల ఒత్తిడి వల్ల పోటీ నుంచి వైదొలిగారు. మాజీ సీఎం కుమారస్వామి ఆదివారం అర్ధరాత్రి శివలింగాచార్య స్వామిజీతో మాట్లాడిన తరువాత రాత్రికి రాత్రి బీ.ఫారం తీసుకుని నామినేషన్ వేశారు. కానీ మంగళవారం పంచపీఠాధీశ్వర ఇతర స్వామీజీల ఒత్తిడితో గురువారం నామినేషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. జేడీఎస్ నేతల బహిష్కరణ యశవంతపుర: బెంగళూరు మహలక్ష్మీ లేఔట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గోపాలయ్యకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని బీబీఎంపీ జేడీఎస్ కార్పొరేటర్ హేమలతా గోపాల య్య తో పాటు ఇద్దరు జేడీఎస్ నాయకులను పార్టీ నుండి బహష్కరించారు. మహదేవ్, జయరామ్ అనేవారిని పార్టీనుంచి బహష్కరించారు. -
నివురుగప్పిన నిప్పులా అసమ్మతి!
బెంగళూరు: జేడీఎస్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి బహిర్గతం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జేడీఎస్‌ను వీడనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎప్పడు ఏ రకంగా బాంబు పేల్చుతారోనని పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడంతో జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో అసమ్మతి మరింత తారా స్థాయికి చేరింది. మంత్రిగా పని చేసిన జీ.టి. దేవెగౌడ.. సంకీర్ణ సర్కార్ పతనం తర్వాత జేడీఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఈయన బీజేపీ నేతలతో టచ్‌లో ఉంటున్నట్లు సమాచారం. మరో ఆరుగురు కూడా అదే దారిలో ఉన్నట్లు సమాచారం. పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అనంతరం బెర్తులు ఖరారు చేసుకునే పనిలోపడ్డారు. బీజేపీ నేతలతో జీటీ దేవెగౌడ చెట్టాపట్టాల్ గత శాసనసభ ఎన్నికల్లో మాజీ సీఎం.హెచ్డి.కుమార స్వామితో కలిసి మొత్తం జేడీఎస్ పార్టీ 37 మంది శాసన సభ్యులు విజయం సాధించారు. ఆపరేషన్ కమలం నేపథ్యంలో ఎమ్మెల్యే హెచ్ విశ్వనాథ్, మహాలక్ష్మి లేఔట్ ఎమ్మెల్యే గోపాలయ్య, కేఆర్‌పేట ఎమ్మెల్యే నారాయణగౌడలు పార్టీని వీడారు. వీరిపై అనర్హత వేటు పడింది. దీంతో జేడీఎస్ బలం 34కు చేరింది. వీరిలో మరో ఆరుగురు రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అదేవిధంగా మాజీ మంత్రి చెన్నిగప్ప కుమారుడు బీ.సీ.గౌరి శంకర్ కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం పతనమైనప్పటి నుంచి మాజీ మంత్రి జీటీ దెవెగౌడ.. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌షాలను నిరంతరం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మైసూరులో బీజేపీ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అప్పడపుడు సీఎంను కూడా కలుస్తున్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే అయిన గుబ్బి శ్రీనివాస్ ఇటీవల మాజీ మంత్రి డీకే. శివకుమార్‌కు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాకు హాజరు కాని మాజీ సీఎం కుమారస్వామిపై ఆరోపణలు చేశారు. వీడేది వీరేనా ? జీటీ దేవెగౌడ (చాముండేశ్వరి), ఆర్.శ్రీనివాస్ (గుబ్బి), శివలింగేగౌడ (ఆరిసికెరె), మహాదేవ్ (పిరియాపట్టణ), సురేష్‌గౌడ (నాగమంగల), రవీంద్ర శ్రీకంఠయ్య (శ్రీరంగపట్టణ), సత్యనారాయణ (సిరా)లు పార్టీ వీడటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
రాయని డైరీ : కె.ఆర్.రమేశ్ (కర్ణాటక స్పీకర్)
కుమారస్వామి మూడ్‌లో లేరు. మూడ్‌లో లేకపోతే లేకపోయారు, సిఎం సీట్లో కూర్చునే మూడ్ కూడా ఆయనలో కనిపించడం లేదు! ఆదివారం ఎప్పుడు పోతుందా, సోమవారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు విశ్వాస తీర్మానంలో ఓడిపోతామా? ఎప్పుడు వెళ్లి ప్రతిపక్షంలో కూర్చుంటామా అన్నట్లుగానే ఉన్నారు. సోమవారం ఫ్లోర్ టెస్ట్. ‘‘సోమవారమే కదా రమేశ్’’ అని అడిగారు కుమారస్వామి నుదుటిని చేత్తో పట్టుకుని. ఏడాదిగా ఆయన అలా నుదుటిని చేత్తో పట్టుకునే కూర్చుంటున్నారు. సభ లోపల అంతే, సభ బయటా అంతే. అసలు లోపలనీ బయటనీ కాదు.. మనిషి కనపడితే చాలు, నుదుటిపైకి ఆయన చెయ్యి వెళ్లిపోతోంది. మనుషుల మీద నమ్మకం పోయి, అదలా వెళ్లిపోతున్నట్లుంది. ‘‘మాట్లాడవేం రమేశ్! సక్సెస్‌ఫుల్‌గా పైకి లేస్తామంటావా?’’ అని అడిగారు. సర్ప్రైజ్ అయ్యాను. ‘సక్సెస్‌ఫుల్‌గా పడిపోతామా రమేశ్’ అని అడగాలి అసలైతే ఆయన ఇప్పుడున్న మూడ్‌లో. ‘సక్సెస్‌ఫుల్‌గా పైకి లేస్తామా రమేశ్?’ అని అడిగారంటే ఆయన మూడ్‌లోనే ఉన్నారని! ‘‘సంతోషంగా ఉంది కుమారస్వామి’’ అన్నాను. కుమారస్వామిని కుమారస్వామి అనేంత చనువు ఆయన దగ్గర నాకు ఉంది. ఉంది అని నేను అనుకుంటున్నాను కానీ, ఉంటే తప్పేముంది అని ఆయన అనుకుంటున్నారో లేదో నుదుటిపై నుంచి ఆ చెయ్యి అడ్డు తీస్తే గానీ తెలియదు. కుమారస్వామి నా కంటే పదేళ్లు చిన్న. పైగా పాతికేళ్ల క్రితమే దేవెగౌడ దగ్గర స్పీకర్‌గా చేశాను. తండ్రి దగ్గర స్పీకర్‌గా చేసి, కొడుకు దగ్గరా స్పీకర్‌గా చేస్తున్నప్పుడు తెలియకుండానే ఆ మాత్రం చనువు వద్దన్నా వచ్చేస్తుందేమో. ఆయన నన్ను రమేశ్ అంటారు. నేను కుమారస్వామి అంటాను. ‘‘ఇప్పుడే ఎందుకు సంతోషం? సక్సెస్‌ఫుల్‌గా పైకి లేచాక కదా. అసలే ఒకసారి ఫెయిలయ్యాం. క్రయోజనిక్ ఇంజిన్‌లో మళ్లీ ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే?!’’ అన్నారు కుమారస్వామి. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఆయన అంటున్నది చంద్రయాన్ గురించి!! మూడ్‌లోకి వచ్చారనుకున్నాను కానీ, మూడ్‌లోనే ఉండిపోతారని అనుకోలేదు.‘‘మీరు ఫ్లోర్ టెస్ట్ గురించి అడుగుతున్నారని అనుకున్నాను. స్పేస్ టెస్ట్ గురించని అనుకోలేదు’’ అన్నాను. ‘‘ఫ్లోర్ టెస్ట్‌లో మీరు గానీ, నేను గానీ సంతోషపడేందుకు ఏముంటుంది రమేశ్? మీరు స్పేస్ టెస్ట్ గురించి చెబుతారనే నేను అనుకున్నాను’’ అన్నారు కుమారస్వామి.. ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ బయటికి తీసి! ఆయన కర్చీఫ్‌ని తీశారంటే తీరని ఆవేదనలో ఉన్నారనే. పైకి స్పేస్ అంటున్నారు కానీ, ఆయన లోపలంతా ఫ్లోరే ఉన్నట్లుంది. ‘‘మీరలా కర్చీఫ్ బయటికి తీసినప్పుడల్లా నాకొకటి అర్థం కాకుండా ఉండిపోతుంది కుమారస్వామీ’’ అన్నాను. ‘‘మీకేం అర్థం కాకుండా ఉండిపోకూడదని మీరు అనుకుంటున్నారో చెప్పండి రమేశ్’’ అన్నారు కుమారస్వామి. ‘‘కర్చీఫ్‌ను తియ్యకుండానే కన్నీళ్లను ఆపలేమా అన్నది నాకెప్పుడూ అర్థం కాని విషయం. మీరనే కాదు. ఎవరైనా..’’ అన్నాను. విరక్తిగా నవ్వారు కుమారస్వామి. ‘‘వస్తున్న కన్నీళ్లను, వెళ్తున్న ఎమ్మెల్యేలను ఎవరాపగలరు’’ అన్నారు నవ్వుతూనే కళ్లు తుడుచుకుంటూ. కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై మూడు రోజులుగా చర్చ జరుగుతోందని మాత్రమే దేశానికి తెలుసు. కుమారస్వామి సీఎం అయిన నాటి నుంచి పద్నాలుగు నెలలుగా జరుగుతున్నదీ అదేనని ఆయనకు, నాకు మాత్రమే తెలుసు. -
‘కుమారస్వామి తక్షణం వైదొలగాలి’
బెంగళూర్ : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ మెజారిటీ కోల్పోయిందని, ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బీజేపీ శాసనసభాపక్ష భేటీకి ముందు ఆయన మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలతో మాట్లాడిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై తమ పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సంఖ్యాబలం లేకపోయినా ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలోనే తాము ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆయన సంకేతాలు పంపారు. సంకీర్ణ సర్కార్ మెజారిటీ కోల్పోయినందున ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కోరుతూ తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష కూడా ఇదేనని యడ్యూరప్ప చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగే నైతిక హక్కు సంకీర్ణ ప్రభుత్వానికి లేదని అన్నారు. మరోవైపు ముంబై హోటల్లో బసచేసిన కాంగ్రెస్, జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు గోవాకు తమ మకాం మార్చారు. -
‘సుల్తాన్ ఉత్సవాలకైతే డబ్బులుంటాయి’
బెంగళూరు : సుల్తాన్ ఉత్సవాలు జరపడానికి వారి దగ్గర డబ్బులుంటాయి కానీ హంపి చరిత్రను గుర్తు చేసుకోవడానికి మాత్రం డబ్బు ఖర్చు చేయలేరని ప్రధాని నరేంద్ర మోదీ.. కుమారస్వామి ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏడాది నవంబర్ 10న టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక వెళ్లిన నరేంద్ర మోదీ కాంగ్రెస్ జేడీఎస్ కూటమిపై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నది 20 శాతం ప్రభుత్వమని.. దాని ప్రధాన ఉద్దేశం కమిషన్లు సేకరించడమేనని ఆరోపించారు. కర్ణాటకలో రాచరికం, అవినీతి ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తుందని.. ప్రజలంతా బీజేపీ పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు జాతీయవాదులకు, రాచరికానికి మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో కుమారస్వామి సైన్యాన్ని ఉద్దేశిస్తూ.. రోజుకు రెండు పూటలా భోజన దొరకని వారే.. ఆర్మీలో చేరతాని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన మోదీ దేశ భద్రత కోసం ప్రాణాలర్పించే వారి పట్ల ఇంత చులకన భావం ఉన్నవారు.. ప్రజలకు ఎలాంటి భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. -
ఈసీ, ఐటీ వేధింపులపై సీఎం ఫైర్
సాక్షి, బెంగళూర్ : కర్నాటక సీఎం హెచ్డీ కుమారస్వామి ఈసీ, ఆదాయ పన్ను శాఖలపై విరుచుకుపడ్డారు. ఈ రెండు వ్యవస్థలు తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఈసీ అధికారులు సీఎం రేంజ్ రోవర్ కారును, ఆయన కాన్వాయ్‌ను తనిఖీల నిమిత్తం నిలిపివేసిన నేపథ్యంలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈసీ అధికారులు వారి విధి నిర్వహణను నిరాటంకంగా చేపట్టవచ్చని, అయితే కేవలం అనుమానాలున్నాయనే సాకుతో తమను వేధించడం తగదని ఆయన పేర్కొన్నారు. కాగా, సీఎం కుమారస్వామి బుధవారం హసన్ వెళుతుండగా, ఈసీ నిఘా బృందం హైవేపై సీఎం కారుతో పాటు కాన్వాయ్‌ను అడ్డగించి తనఖీలు నిర్వహించింది. మరోవైపు వాహన తనిఖీల్లో ఈసీకి ఏమీ పట్టుబడలేదని సమాచారం. బెంగళూర్-హసన్ హైవేపై తాము రోజూ రాజకీయ పార్టీలు, నేతలు, అభ్యర్ధుల వాహనాలను తనిఖీ చేసి ఎన్నికల నియమావళి అమలవుతున్న తీరును పరిశీలిస్తామని, ఇదే ప్రక్రియలో సీఎం కాన్వాయ్‌ను తనిఖీ చేశామని ఈసీ అధికారి ఎన్ఎస్ దర్శన్ పేర్కొన్నారు. -
దేవెగౌడపై సంచలన వ్యాఖ్యలు..
బెంగళూరు : కర్ణాటకలో ఆడియో టేపుల వ్యవహారం సెగలు పుట్టిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బేరసారాలు జరిపినట్టుగా చెబుతున్న ఆడియోలను ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నేతలు విడుదల చేయడంతో ఈ దుమారం మొదలైంది. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే.. జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో టేపు... జేడీఎస్ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హసన్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడదిగా చెప్పుకుంటున్న తాజా ఆడియో క్లిప్పులోని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రీతమ్ గౌడగా చెప్పబడుతున్న బీజేపీ ఎమ్మెల్యే.. జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడుతూ.. ‘త్వరలోనే మాజీ ప్రధాని దేవెగౌడ చనిపోతారు... ఆయన కొడుకు కుమారస్వామి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అతి త్వరలోనే జేడీఎస్ ఓ చరిత్రగా మిగిలిపోతుంది’ అంటూ ఆ ఆడియో టేపులో రికార్డ్ అయ్యింది. దీన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడంతో... జేడీఎస్ కార్యకర్తలు రగిలిపోయారు. హసన్ జిల్లాలోని ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే తనను చంపేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోందని ప్రీతమ్ గౌడ ఆరోపించారు. కాగా ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి కుమారస్వామి... జేడీఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఈ ఆడియో టేపుల వ్యవహారం కన్నడ రాజకీయాలను ఎటు తీసుకుపోతాయో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. -
‘సీఎం ఇంట్లో బాంబు.. పేలబోతోంది’
కృష్ణరాజపురం : కర్ణాటక ముఖ్యమంత్రి ఇంట్లో బాంబు పెట్టామని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ చేసిన యువకుడిని జేపీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరప్పన అగ్రహార ప్రాంతానికి చెందిన మన్సూర్ సోమవారం రాత్రి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తన పేరు గోపాల్ అని జేపీ నగర్లో ఉన్న సీఎం కుమారస్వామి ఇంట్లో బాంబు పెట్టానని మరికొద్ది సేపట్లో బాంబు పేలనుందంటూ చెప్పి ఫోన్ పెట్టేసాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు భద్రత బలగాలు, బాంబు నిర్వీర్య దళం, శ్వానదళంతో అక్కడికి చేరుకొని అణువణువు క్షుణ్ణంగా గాలించగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఇది కేవలం బెదిరింపు కాల్‌గా నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కంట్రోల్ రూమ్‌కు వచ్చిన నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన జేపీ నగర్ పోలీసులు విచారణ జరపగా తన అసలు పేరు మన్సూర్ అని పోలీసులను తప్పుదారి పట్టించడానికి తన పేరు గోపాల్‌గా మార్చి చెప్పినట్లు అంగీకరించాడు. -
రాష్ట్రానికి ముగ్గురు సీఎంలా?
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరో తేల్చిచెప్పాలని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడను బీజేపీ ప్రశ్నించింది. అసలు ప్రస్తుత సీఎం ఎవరంటూ చమత్కరించింది. ఒక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు సీఎంగా వ్యవహరిస్తున్నారని కర్ణాటక బీజేపీ శాఖ మంగళవారం ట్వీట్ చేసింది. కుమారస్వామి సోదరుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పీడబ్ల్యూడీ) మంత్రి రేవణ్ణ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ మంత్రుల శాఖల్లో ఆయన కల్పించుకుని పెత్తనం చలాయిస్తున్నారంటూ ట్విటర్లో పేర్కొంది. దేవెగౌడ కూడా రాష్ట్ర పరిపాలన వ్యవహరాల్లో తలదూరుస్తున్నారని, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సీఎంలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది. ‘అనేక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచుస్తున్నారు. అసలు మీలో ఎవరు సీఎం అని ప్రజలకు సందేహంగా ఉంది. ముందు నిజమైన సీఎం ఎవరో తేల్చుకోండి’ అని ట్విట్ చేసింది. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తండ్రి, ఇద్దరు కొడుకులు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, జేడీఎస్‌ని కుటుంబ పార్టీగా బీజేపీ వర్ణించింది. బీజేపీ వ్యాఖ్యలపై జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ విశ్వనాధ్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నేతలు అర్థమంతంగా మాట్లాడాలని హెచ్చరించారు. -
ఆ నేత ట్రాజెడీ కింగ్..
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌పై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. అలాంటి అవకాశవాద కూటములు దేశం కోసం కాకుండా మనుగడ కోసమే పనిచేస్తాయని విమర్శించారు. దేశానికి నరేంద్ర మోదీ లాంటి నేత అవసరం ఉందని, కర్ణాటక సీఎం కుమారస్వామి వంటి ట్రాజెడీ కింగ్‌లతో పనిలేదని ఎద్దేవా చేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం మింగడంతో సమానమంటూ ఆదివారం జరిగిన ఓ సభలో కుమారస్వామి భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ ఏం చేసిందో గతంలో చౌదరి చరణ్ సింగ్, చంద్రశేఖర్, హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ల విషయంలోనూ ఇదే తీరుతో వ్యవహరించిందని జైట్లీ దుయ్యబట్టారు. మోదీని అధికారం నుంచి తప్పించడమే వీరి అవకాశవాద కలయిక అజెండా అని ఆరోపించారు. సిద్ధాంతపర వైరుధ్యాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం దేశాన్ని ముందుకు నడపలేదని తేల్చిచెప్పారు. ఈ తరహా ప్రభుత్వాలు దేశ ప్రయోజనాలకు విఘాతమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సంకీర్ణ సర్కార్‌కు సారథ్యం వహించే ప్రధాని కెమెరాల ఎదుట కంటనీరు ఒలికిస్తే అది యూపీఏ 2 కన్నా ఘోరంగా ఉంటుందని జోస్యం చెప్పారు. -
మీ పదవీకాలం సజావుగా సాగాలి: మోదీ
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జేడీఎస్ నేత కుమారస్వామికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ‘కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసిన కుమారస్వామి, పరమేశ్వరలకు శుభాకాంక్షలు. వారి పదవీకాలం సజావుగా సాగాలని కోరుకుంటున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీజేపీ దూరంగా ఉంది. కమల్ శుభాకాంక్షలు చెన్నై: కొత్త సీఎం కుమారస్వామికి మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘కొత్త ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఇది మంచి ఆరంభం’ అని ట్వీట్ చేశారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా, రాహుల్, ఏచూరి, కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యలతో కమల్ సమావేశమయ్యారు. -
అందుకే ప్రమాణస్వీకారానికి డుమ్మా కొట్టారు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానమున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ముఖం చూయించలేకే ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ బలంతోనే కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ..కేసీఆర్ బెంగుళూరలో బీజేపీకి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా థర్డ్‌ప్రంట్ కడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ తొత్తుగా కేసీఆర్ పని చేస్తున్నారని మండిపడ్డారు. సోనియా భిక్ష వల్లే కేసీఆర్ రాష్ట్రానికి సీఎం అయ్యారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను తెలంగాణలో లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎకరాకు రూ.4 వేలు ఇస్తున్నారని, ఇది రైతు బంధు పథకం కాదు..ఓట్ల బంధు పథకం అని ఎద్దేవా చేశారు. గిట్టుబాటుధర కల్పిస్తే ఇప్పుడు ఇచ్చే రైతు పెట్టుబడి పథకం కంటే ఎక్కువగా డబ్బులు వస్తాయని తెలియజేశారు. మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పటి వరకు కూడా స్పందించలేదని, రైతు బంధు పథకమని నమ్మి ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు ఓటు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పట్టించుకోడని చెప్పారు. -
కుమారస్వామి పదవి మూణ్నాళ్ల ముచ్చటే
విజయవాడ : ఇంకా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయకుండానే కాంగ్రెస్, జేడీఎస్ నాయకుల మధ్య పదవుల కోసం గొడవ మొదలైందని, కుమారస్వామి పదవి మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య విమర్శించారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో 150 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్య విలువలు లేవని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 21 మంది వైఎస్సార్సీపీ నాయకులను తీసుకుని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయం గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వద్దు, అది సంజీవని కాదని చంద్రబాబు నాయుడే చెప్పారన్నారు. చంద్రబాబు మెప్పు పొందేందుకు ఆ పార్టీ నాయకులే ఇప్పుడు కావాలని మాట్లాడుతున్నారని అన్నారు. -
కుమారస్వామికి పిలుపు.. నేడే సీఎంగా ప్రమాణం!
సాక్షి, బెంగళూరు: బల నిరూపణ పరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించడంతో కర్ణాటక రాజకీయం ఊహించని మలుపుతిరిగింది. బలపరీక్ష తీర్మానంపై మాట్లాడిన సందర్భంలోనే సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనివార్యమైంది. ఇప్పటికే జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమర్థిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సంతకాలు సమర్పించిన దరిమిలా గవర్నర్ వజుభాయ్ వాలా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారమే కుమారస్వామికి గవర్నర్ నుంచి పిలుపు రానున్నట్లు తెలిసింది. ఈ రోజే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని కన్నడ రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఇటు కుమారస్వామి సైతం మీడియాతో మాట్లాడుతూ ‘గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. (చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) -
తాజ్‌కృష్ణలో ముగిసిన కర్ణాటక సీఎల్పీ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీలో శనివారం బల నిరూపణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్ - జేడీఎస్ అధినేతలు తాజ్‌కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన కర్ణాటక సీఎల్పీ సమావేశం ముగిసింది. కర్ణాటక సీఎల్పీ నేతగా సిద్ధారామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిన్నర్ తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరనున్నారు. వారికి టీ కాంగ్రెస్ ఏపీ సరిహద్దు వరకు 200 వాహనాల కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి ఏపీసీసీ, కర్ణాటక నాయకుల కాన్వాయ్ జత చేరనుంది. -
బీఈడీ కళాశాలల్లో 28వేల సీట్లు ఖాళీ
యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి) రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో 28,770 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఏపీఎడ్‌సెట్–2016 కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 27 నుంచి 29 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. విద్యార్థులు పెట్టుకున్న వెబ్ఆప్షన్ల మేరకు బుధవారం సీట్ల కేటాయింపు చేశామన్నారు. మూడు రోజుల పాటు జరిగిన వెబ్ కౌన్సెలింగ్‌కు 3,657 మంది హాజరై, సర్టిఫికెట్లను పరిశీలింప చేసుకున్నారన్నారు. 487 కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 32,145 సీట్లకు గాను 3,375 మందికి సీట్లను కేటాయించామన్నారు. సీట్లు కేటాయింపబడిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ విద్యార్థులకు ఈ నెల 8వతేదీనుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామన్నారు. -
తెప్పపై కుమారస్వామి చిద్విలాసం
కార్వేటినగరం : కార్వేటినగరం కుమారగిరిపై వెలసి ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. వళ్లీ దేవసేన సమేతంగా స్వామివారు తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు, అలంకరణలు జరిగాయి. సాయంత్రం చాకలివానిగుంట ఎస్టీ కాలనీవాసులు ఆనవాయితీ ప్రకారం సారె సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చారు. పుర వీధుల్లో ఊరేగింపు అనంతరం పుష్కరిణి వద్ద వేంచేపు చేశారు. అనంతరం తెప్పపై కొలువుదీర్చి వేదమంత్రోచ్చారణలు,మేళతాళాల నడుమ ఏడు సార్లు పుష్కరిణిలో ప్రదక్షిణ చేశారు. తెప్పను లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. తెపోత్సవాన్ని తిలకించేందుకు పలు మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఐ మోహన్, ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.