
బెంగళూరు : కర్ణాటకలో ఆడియో టేపుల వ్యవహారం సెగలు పుట్టిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బేరసారాలు జరిపినట్టుగా చెబుతున్న ఆడియోలను ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నేతలు విడుదల చేయడంతో ఈ దుమారం మొదలైంది. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే.. జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో టేపు... జేడీఎస్ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హసన్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడదిగా చెప్పుకుంటున్న తాజా ఆడియో క్లిప్పులోని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ప్రీతమ్ గౌడగా చెప్పబడుతున్న బీజేపీ ఎమ్మెల్యే.. జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడుతూ.. ‘త్వరలోనే మాజీ ప్రధాని దేవెగౌడ చనిపోతారు... ఆయన కొడుకు కుమారస్వామి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అతి త్వరలోనే జేడీఎస్ ఓ చరిత్రగా మిగిలిపోతుంది’ అంటూ ఆ ఆడియో టేపులో రికార్డ్ అయ్యింది. దీన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడంతో... జేడీఎస్ కార్యకర్తలు రగిలిపోయారు. హసన్ జిల్లాలోని ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
అయితే తనను చంపేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోందని ప్రీతమ్ గౌడ ఆరోపించారు. కాగా ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి కుమారస్వామి... జేడీఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఈ ఆడియో టేపుల వ్యవహారం కన్నడ రాజకీయాలను ఎటు తీసుకుపోతాయో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.
Comments
Please login to add a commentAdd a comment